బార్డర్ లో గుక్క పట్టి ఏడ్చే చిన్నారి ఫొటోకు వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డ్

SMTV Desk 2019-04-16 14:33:46  Getty Images photographer John Moore, World Press Photo Contest for 2019, Crying Girl on the Border

వాషింగ్టన్: తన తల్లిని తనను అమెరికా సరిహద్దు అధికారులు అదుపులోకి తీసుకునే సమయంలో ఏడ్చే చిన్నారి ఫోటో ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డ్ గెలుచుకొంది. గత ఏడాది హోండురాకి చెందిన శాండ్రా శాంచెజ్, ఆమె బిడ్డ యానెలా అక్రమంగా అమెరికా-మెక్సికో సరిహద్దు దాటుతుండగా గెట్టీ ఫోటోగ్రాఫర్ జాన్ మూర్ తీసిన ఈ ఫోటో వేరే తరహా హింసాకాండను, మానసికమైన హింసను చూపించిందని జడ్జిలు పేర్కొన్నారు.గుక్కపట్టి ఏడుస్తున్న పసిపిల్ల ఫోటో ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైంది. దీంతో వేలాదిగా వలస వచ్చినవారిని తమ బిడ్డలతో వేరు చేస్తున్న వాషింగ్టన్ వివాదాస్పద విధానంపై ఉవ్వెత్తున ఆగ్రహజ్వాలలు రగిలాయి.వేరైన తల్లీ బిడ్డల్లో యానెలా, ఆమె తల్లి లేరని ఆ తర్వాత యుఎస్ కస్టమ్స్, సరిహద్దు భద్రత అధికారులు వివరణ ఇచ్చారు. కానీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో గత ఏడాది జూన్ లో అధ్యక్షుడు ట్రంప్ తన నిర్ణయాన్ని ఉపసంహరించాల్సి వచ్చిందని జడ్జిలు తెలిపారు.ఆమ్ స్టర్ డ్యామ్ కేంద్రంగా పనిచేసే సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 4,738 మంది ఫోటోగ్రాఫర్ల నుంచి 78,801 ఫోటోలు వచ్చాయి. వీటిని పరిశీలించిన జడ్జిలు మూర్ ఫోటోని అత్యుత్తమమైనదిగా ఎంపిక చేశారు.