కాలిఫోర్నియాలో స్ట్రాటోలాంచ్‌ తొలి టేకాఫ్

SMTV Desk 2019-04-15 10:48:46  Stratolaunch plane takes flight in California, Stratolaunch

కాలిఫోర్నియా: కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో ఉండే మోజావే విమానాశ్రయం నుంచి ప్రపంచ అతిపెద్ద విమానం స్ట్రాటోలాంచ్‌ శనివారం తొలిసారి ఎగిరింది. 2,26,800 కేజీల బరువున్న ఈ విమానం రెక్కల పొడవు 117మీటర్లు. ఈ విమానం విజయవంతంగా టేకాఫ్ కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన విమానం టేకాఫ్ అయిన రికార్డును సొంతం చేసుకుంది. గంటకు 304కి.మీ వేగంతో 17వేల అడుగుల ఎత్తులో ప్రయాణించింది.6 ఇంజిన్లు, 2 విమాన బాడీలు కలిగిన ఈ విమానం గరిష్ఠంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరేలా రూపొందించారు. అయితే ఈ విమానం ఎగరడానికి చాలా పెద్ద రన్‌వే కావాల్సి ఉంటుంది. స్ట్రాటోలాంచ్ అనే కంపెనీ దీనిని తయారుచేసింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు దివంగత పాల్ అలెన్ 2011లో ఈ కంపెనీని స్థాపించారు.