న్యాయ్ పథకానికి మోడీ ఆప్తమిత్రుడి సొమ్మునే రాబడుతాం : రాహుల్

SMTV Desk 2019-04-15 10:48:04  rahul gandhi, congress party, nyay scheme, narendramodi, anil ambani

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ప్రధానధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కర్నాటకలో ఎన్నికల సభలలో మాట్లాడుతూ....కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ్ (న్యూన్‌తమ్ ఆయ్ యోజన) అమలుకు ప్రధాని మోడీ ఆప్తమిత్రుడి సొమ్మునే రాబడుతామని అన్నారు. నిరుపేదలకు కనీస ఆదాయ భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రకటించింది. దీనితో చౌకీదారు (మోడీ) ముఖం కందగడ్డగా మారింది. వెలవెలపోయింది. న్యాయ్ పథకానికి డబ్బులు ఎక్కడి నుంచి సమకూరుతాయని ప్రధాని అపహాస్యం చేస్తున్నారని, అయితే దీనికి తమ వద్ద మార్గం ఉందని రాహుల్ చెప్పారు. ప్రధాని మోడీ ఈ ఐదేళ్ల కాలంలో నమ్ముకున్న , నమ్మిన ఆత్మీయ స్నేహితులైన పారిశ్రామికవేత్తలకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని అన్నారు. మోడీకి కావల్సిన స్నేహితుడు, రిలయన్స్ అనిల్ అంబానీ నుంచే కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పథకానికి నిధులు రాబట్టుకుంటుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. కర్నాటకలో కోలార్ ఎన్నికల సభలో రాహుల్ తమ ప్రసంగంలో మోడీని లక్షంగా ఎంచుకుని ప్రచారం సాగించారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాగ్దానాల నుంచి వెనకకు పొయ్యేది లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోని పేదల కుటుంబాల బ్యాంకు ఖాతాలలోనికి తాము ప్రకటించినట్లుగా సంవత్సరానికి రూ 72,000 జమ అయి తీరుతాయని స్పష్టం చేశారు.