అలీ, బలీ ఇద్దరూ తమ దళితుల పక్షం వారే: మాయావతి

SMTV Desk 2019-04-15 10:36:56  bsp party chief mayavati, sp party chief akhilesh yadav, loksabha elections, bhajarangh dal, ali

బదౌన్: అలీ, బలీ ఇద్దరూ తమ దళితుల పక్షం వారేనని, ప్రత్యేకించి బజ్‌రంగ్ బలీ ( హనుమాన్)కి దళిత కులస్తులతో సంబంధం ఉందని బిఎస్‌పి అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యానాథ్ తాము బజ్‌రంగ బలీ వారమనే వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్రంలోని బదౌనీలో శనివారం జరిగిన ఎన్నికల సభలో మాయావతి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తమకు అలీ, బలీ ఇద్దరూ కావల్సిన వారే అని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాము ఆయనకు (ఆదిత్యానాథ్) స్పష్టం చేస్తున్నామని చెప్పారు. అత్యధిక స్థానాలు ఉన్న యుపిలో ఎన్నికల ఉధృతి తరుణంలో మతపరమైన వ్యాఖ్యలకు దిగుతున్నారనే అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనితో ఆదిత్యానాథ్‌కు, మాయావతికి ఎన్నికల సంఘం నోటీసులు వెలువరించింది. ఇద్దరూ తమ జవాబు ఇచ్చుకోవాలని వేర్వేరుగా తెలిపింది. శనివారం జరిగిన ఎన్నికల సభలో మాయావతి ప్రత్యేకించి ఆదిత్యానాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆదిత్యానాథ్ స్వయంగా గత ఏడాది ఒక సందర్భంలో హనుమాన్‌ను అటవిజాతికి చెందిన వాడని, దళితుడు అని చెప్పిన విషయాన్ని మాయావతి పరోక్షంగా ప్రస్తావించారు. తాను ఆదిత్యానాథ్‌జీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు, ఆయన స్వయంగా తమ పూర్వీకుల సమాచారం తెలియచేసినట్లు చెప్పారు. తమకు అలీ బజ్‌రంగ్ బలీ ఇద్దరూ ఆత్మీయులే అని, ఈ ఇద్దరి కలయిక ఈ ఎన్నికలలో సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నామని మాయావతి తెలిపారు. స్థానిక లోక్‌సభ స్థానం నుంచి ఎస్‌పి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ధర్మేంద్ర యాదవ్ ప్రచారానికి బిఎస్‌పి ఎస్‌పి ఆర్‌ఎల్‌డి కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన సభలో బిఎస్‌పి అధినేత్రి ప్రసంగించారు. ఈ లోక్‌సభ ఎన్నికలలో యుపిలో అయితే యోగి పార్టీ బిజెపికి అటు అలీ ఇటు బలీ ఓట్లు కూడా రావని, ఈ పోటీలో నమో నమో పార్టీ వారు దెబ్బతింటారని, వారి అధికారం పోతుందని, వచ్చేది జై బీమ్ అధికారం అని, దేశానికి ఈ అవసరం ఉందని స్పష్టం చేశారు.