ఆర్సీబీలోకి ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఎంట్రీ

SMTV Desk 2019-04-12 19:36:56  ipl 2019, rcb, virat kohli, Dale Steyn to join rcb

ఈ ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములు చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది. బెంగళూరు టీమ్‌లోకి ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మొదట ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కౌల్టర్ నైల్‌ని టీమ్‌లోకి తీసుకోవాలని బెంగళూరు ఫ్రాంఛైజీ తొలుత ఆశించింది. కానీ.. ప్రపంచకప్ సన్నద్ధత కోసం కౌల్టర్ నైల్ మళ్లీ మే మొదటి వారంలోనే స్వదేశానికి వెళ్లిపోతానని చెప్పడంతో.. అతని బదులుగా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్‌స్టెయిన్ తాజాగా ఆర్సీబీ తీసుకుంది. 140-150 కిమీ వేగంతో బంతులు విసిరే డేల్ స్టెయిన్.. దాదాపు రెండు మూడేళ్లు నెం.1 బౌలర్‌గా ఆధిపత్యం చెలాయించాడు. వాస్తవానికి ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి 2010 వరకూ డేల్ స్టెయిన్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తోనే ఆడాడు. ఆ మూడు సీజన్లలో మొత్తం 28 మ్యాచ్‌లాడిన ఈ పేసర్ 27 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత డక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్లకి మారిన డేల్‌స్టెయిన్‌ను ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ఆర్సీబీ నుంచి తాజాగా పిలుపు రావడంతో.. ఈ పేసర్ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈనెల 19న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బెంగళూరు ఆడే మ్యాచ్‌‌తో డేల్ స్టెయిన్ మళ్లీ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసే అవకాశం ఉంది.