ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు....విండీస్ ప్రీమియర్ లీగ్

SMTV Desk 2019-04-12 19:35:12  ipl, west indies cricketers

ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ ) పేరుకు తగట్టు ప్రస్తుతం జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు లేవు అని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ లో దాదాపు ఇండియన్ ఆటగాళ్లను ఎంచుకొని నూతన ఆటగాళ్లను పరిచయం చేస్తూ వారికి అవకాశాలిస్తూ ప్రోత్సహించే లీగ్ ఒకప్పుడు. ఇప్పుడు అది ఎక్కడ కనబడటం లేదు అని క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్లో అయితే వెస్టిండీస్ క్రికెటర్ల హవా కొనసాగుతోంది. ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆండ్రి రసెల్, కిరన్ పొలార్డ్, క్రిస్ గేల్, అల్జారి జోసెఫ్, డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్ తదితరులు ఐపిఎల్‌లో నిలకడగా రాణిస్తూ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతున్న వెటరన్ ఆటగాడు క్రిస్‌గేల్ కూడా భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్‌లో గేల్ నిలకడైన ఆటతో పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన గేల్ 37.17 సగటుతో 223 పరుగులు చేశాడు. అతని స్ట్రయిర్‌రేట్ 158.16గా ఉంది. యువ సంచలనం అల్జారి జోసెఫ్ ఇప్పటి వరకు ఐపిఎల్‌లో కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. అయితే ఆడిన మొదటి మ్యాచ్‌లోనే పెను ప్రకంపనలు సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్జారి జోసెఫ్ ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపిఎల్‌లో ఏ బౌలర్‌కు సాధ్యం కానీ ఫీట్‌ను జోసెఫ్ సొంతం చేసుకున్నాడు. చారిత్రక ప్రదర్శన చేసిన జోసెఫ్ 3.4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ కిరన్ పొలార్డ్ కూడా ఈ సిజన్‌లో నిలకడైన ఆటతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ముంబై సాధిస్తున్న విజయాల్లో పొలార్డ్ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగుతున్న పొలార్డ్ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆండ్రి రసెల్ ఈ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. కోల్‌కతా సాధించిన విజయాల్లో రసెల్ పాత్ర చాలా కీలకంగా మారింది. పలు మ్యాచుల్లో రసెల్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలువడమే అతని జోరుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన ఆల్‌రౌండర్లలో రసెల్ అగ్రస్థానంలో నిలుస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కోల్‌కతా ఈ సీజన్‌లో మెరుగైన స్థితిలో కొనసాగుతుందంటే దానికి రసెల్ బ్యాటింగే ప్రధాన కారణంగా చెప్పాలి. ఇలా దాదాపు అన్ని జట్లలల్లో విదేశీ ఆటగాళ్ళు తమ విద్వంశక ప్రదర్శనలు కనబర్చుతున్నారు కాని ఇండియా తరపున ఏ ఒక్క ఆటగాడు కూడా సరిగ్గా మేరవలేకపోతున్నాడు. ఇది ఐపీఎల్ కాదు విండీస్ లీగ్ అంటూ పలు అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.