ధోనీ భారత్‌లో ఏం చేసినా చెల్లుతుంది...కాని!!!

SMTV Desk 2019-04-12 18:33:04  ipl 2019, csk vs rr, mahendra singh dhoni, dhoni argument in umpires

గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళి కింద ధోనీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో ధోనీపై క్రమంగా విమర్శలు పెరుగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా గురువారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో.. తొలుత నోబాల్‌ని ప్రకటించిన అంపైర్‌ మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో.. అప్పటికే ఔటై చెన్నై టీమ్ డగౌట్‌లో కూర్చుని ఉన్న ధోనీ మళ్లీ మైదానంలోకి వెళ్లి గొడవపడిన విషయం తెలిసిందే. క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఔటైన బ్యాట్స్‌మెన్ మ్యాచ్ మధ్యలో మళ్లీ మైదానంలోకి వెళ్లకూడదనే రూల్‌ కూడా ధోనీకి తెలియదా..? అంటూ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా ధోనీ తీరుపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ మాట్లాడుతూ ‘అంపైర్ నిర్ణయంపై చర్చించేందుకు మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ మైదానంలోకి వెళ్లి ఉండకూడదు. అలా వెళ్లింది ధోనీ అని నాకు తెలుసు. అతను భారత్‌లో ఏం చేసినా చెల్లుతుంది. కానీ.. అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు డగౌట్‌ని వీడి మైదానంలోకి వెళ్లే హక్కు అతనికెక్కడిది..? ఒక జట్టు కెప్టెన్‌గా ధోనీ ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు..?’ అని మండిపడ్డాడు.