హింసాత్మకంగా సాగిన ఏపీ ఎన్నికలు

SMTV Desk 2019-04-12 18:15:03  andhrapradesh elections, tdp, ysrcp, janasena

ఆంధ్రప్రదేశ్ లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు వివాదాలతో, కొట్లాటలతో ముగిసాయి. టిడిపి, వైసీపీ, జనసేన అన్ని పార్టీల కార్యకర్తలకు అనేక గాయాలయ్యాయి. పలు చోట్ల కార్యకర్తలు మృతి చెందారు. వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి నేతలు ఈసారి ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి పోటాపోటీగా తీసుకోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఓవైపు హింస చెలరేగుతున్నా ఓటర్లు అదరకుండా, బెదరకుండా పోలింగ్‌ కేంద్రాలకు పెద్దఎత్తున తరలిరావడం గమనార్హం. ఎపిలో ఈసారి పోలింగ్‌ ఎన్నడూ లేనంత హింసాత్మకంగా మారింది. పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో మహిళలు కూడా పరస్పరం దాడులు చేసుకోవడం కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి వర్గాల మధ్య జరిగిన దాడులతో ఎపి ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చాలా ప్రాంతాల్లో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
**గుంటూరులో నాటకీయ పరిణామాలు : గుంటూరు జిల్లాలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఱావు నియోజకవర్గం సత్తెనపల్లి పరిధిలో రాజుపాలెం మండలం ఇనిమెట్లలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైఎస్‌ఆర్‌సిపి వర్గీయులు దాడి చేశారని టిడిపి వర్గం ఆరోపించింది. పోలింగ్‌ బూతులోకి వెళ్లిన కోడెల…అక్కడ కూర్చున్నారని, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు పార్టీల ఏజెంట్లు గొడవకు దిగారు. పోలీసులు కోడెలను బయిటకి తరలిస్తున్న క్రమంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
**రాప్తాడులో ఘర్షణ : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సిద్ధ రామాపురంలో పోలింగ్‌ కేంద్రంలోనే టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో 10మందికిపైగా గాయపడ్డారు. ఇదే మండలం అనప గ్రామంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
**తాడిపత్రిలో ఇద్దరి మృతి : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో వైఎస్‌ఆర్‌సిపి-టిడిపి కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. వేటకొడవళ్లు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో టిడిపి నేత సిద్ధా భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్త పుల్లారెడ్డి మరణించారు. టిడిపికి చెందిన మరో నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అనంతపురంలో పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. తమ వర్గానికి చెందిన వారిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎంపి జెసి దివాకర్‌ రెడ్డి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
**ఆళ్లగడ్డలో పరిస్థితి ఉద్రిక్తం : కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అహోబిలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ఘర్షణకు దిగారు. టిడిపి అభ్యర్థి భూమా అఖిలప్రియ సోదరి భూమా నాగమౌనిక కారు అద్దాలను వైఎస్‌ఆర్‌సిపి వర్గీయులు ధ్వంసం చేశారు. పోలీసుల తీరుపై నాగమౌనిక ఆగ్రహం చేస్తూ నిరసనకు దిగారు. గంగుల వర్గీయులు వాహనాల్లో రాళ్లు, కర్రలతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు కర్రలతో కొట్టుకుంటూ…రాళ్లు రువ్రుకున్నారు. ఈ ఘటనలో ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డితో పాటు, స్వతంత్య్ర అభ్యర్థి కుందూరు రామిరెడ్డి, మరో ఆరుగురు గాయపడ్డారు.
**ఈవిఎం పగలగొట్టిన జనసేన అభ్యర్థి : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తిలో జనసేన అభ్యర్థి మధుసూదన్‌ గుప్తా రెచ్చిపోయారు. పోలింగ్‌ కేంద్రంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈవిఎం పగులగొట్టారు. గుత్తిలోని 183 నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటేసేందుకు వెళ్లిన మధుసూదన్‌..సీక్రెట్‌ ఓటింగ్‌ వద్ద నియోజకవర్గాల పేర్లు సరిగా రాయకపోవడాన్ని గుర్తించారు. దీనిపై అధికారులను నిలదీశారు. అధికారులు చెప్పిన సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందరూ చూస్తుండగానే ఈవిఎంను నేలకేసి కొట్టారు. ఈ ఘటనతో గుత్తిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయణ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
**పూతలపట్టు నియోజకవర్గం బందార్లపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జీని చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
**ప్రకాశం జిల్లా చీరాలలో 103 పోలింగ్‌ బూత్‌లో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి ఏజెంట్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది.
**చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి అభ్యర్థులు పరస్పరం దాడులకు తెగబడ్డారు.
**తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు.
**ఏలూరులో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్‌ఆర్‌సిపి వార్డు కన్వీనర్‌ మట్టా రాజు తలకు తీవ్ర గాయమైంది. టిడిపి అభ్యర్థి బుజ్జి గన్‌మెన్లు దాడి చేశారని రాజు ఆరోపించారు.