విమానంలో భారీ చోరి

SMTV Desk 2019-04-11 11:41:31  tirana, albenia, tirana airport, money theft by passengers, Austrian Airlines flight OS848 robbed at Tirana Airport

టిరాన: అల్బేనియా రాజధాని టిరానలోని ఓ విమానంలో భారీ చోరి జరిగింది. ఆస్ట్రియా విమానం టిరాన ఎయిర్‌పోర్టుకు చేరుకొని విమానంలోకి ప్రయాణికులు ఎక్కగానే టేకాఫ్‌కు సిద్ధమైంది. అయితే ఈ క్రమంలో అగ్నిమాపక దళం వ్యాన్‌ సాయంతో నలుగురు దుండగులు విమానంలోకి చొరబడి రూ. 77 కోట్లు విలువైన 10 మిలియన్‌ యూరోలను దోపిడీ చేశారు. వీరు నేరుగా రన్‌వే వద్ద ఉన్న విమానం సమీపంలోకి వెళ్లి పైలట్లను తుపాకులతో బెదిరించారు. అనంతరం విమానంలో ఉన్న డబ్బును అపహరించి పరారయ్యారు. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు దుండగులపై కాల్పలు జరిపారు. పోలీసు కాల్పుల్లో ఓ దుండగుడు మృతి చెందాడు. మృతి చెందిన దుండగుడి నుంచి ఏకే47, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. విమానంలో దోపిడీ చేసిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు హెలికాఫ్టర్లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో టిరాన పట్టణ సమీపంలో దగ్ధమైన ఓ కారును గుర్తించారు. దుండగులు ఈ కారును దోపిడీకి ఉపయోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.