చైనాకి తిక్కుంటే.....భారత్ కి ఓ లెక్కుంది!!!

SMTV Desk 2017-08-16 14:38:07  China, India, China media, Doklam, border issue, Made in china products

న్యూఢిల్లీ, ఆగస్ట్ 16: చైనా-భారత్ మధ్య డోక్లాం సరిహద్దు సమస్య రోజురోజుకు ఉదృతమవ్వడమే కాకుండా, డ్రాగన్ దేశం రోజుకో తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. ఈ నేపధ్యంలో ఆగ్రహించిన భారతీయులలో ఆ దేశ వస్తువులను బహిష్కరించాలన్న పట్టుదల పెరుగుతూ, సామాజిక మాధ్యమాలలో సంచలనం రేకెత్తిస్తున్న తరుణంలో కేంద్రం ఒక అడుగు ముందుకు వేసింది. అసలు ఆ దేశం నుంచి ఏన్ని వస్తువులు దిగుమతి అవుతున్నాయో లెక్క తేల్చనుంది. ఒక సర్వే లెక్కల ప్రకారం చైనాకు చెందిన 22 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్టులు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు దూసుకెళుతున్నాయి. చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద పెద్ద పరికరాల వరకూ ఎన్నో చైనాలో తయారైన వస్తువులు భారత మార్కెట్లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫోన్లతో పాటు వైద్య రంగంలో ఉపకరించే పరికరాలు, టెలికం నెట్ వర్క్ పరికరాలు, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) డివైస్ లు ప్రధాన స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి. ఇటీవల ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఏమిటి అనే విషయాన్ని తేల్చేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇండియాలో ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా చైనా ప్రొడక్టులకు చెక్ చెప్పవచ్చని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ఇది జరిగేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. భారత్‌లోని అతిపెద్ద అంతర్జాల వాణిజ్యంలో సైతం చైనా సంస్థలు అధిక వాటాలను కలిగి ఉండటం, భారత దేశానికి సంబంధించిన డేటా సర్వర్లు అక్కడ ఉండటం ప్రమాదకరమని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం 280 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇండియా ఐటీ విలువ 2022 నాటికి ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందన్న అంచనాల దృష్ట్యా చైనా ప్రాతినిథ్యాన్ని తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. చైనా దిగుమతులను నిషేధించాలని, కుదరని పక్షంలో సుంకాలను భారీగా పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.