జోరు పెంచిన చెన్నై....ఖాతాలో మరో విజయం

SMTV Desk 2019-04-10 15:46:10  chennai super kings, csk vs kkr, ipl 2019

చెన్నై: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఈరోజు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత ఆండ్రీ రసెల్ (50 నాటౌట్: 44 బంతుల్లో 5x4, 3x6) సమయోచిత అర్ధశతకం బాదడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయగా.. డుప్లెసిస్ (43 నాటౌట్: 45 బంతుల్లో 3x4), అంబటి రాయుడు (21: 31 బంతుల్లో 2x4) నిలకడగా ఆడటంతో చెన్నై మరో 16 బంతులు మిగిలి ఉండగానే 111/3తో సులువుగా గెలుపొందింది. దీంతో.. తాజా సీజన్‌లో ఐదో విజయాన్ని అందుకున్న చెన్నై 10 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఈ మ్యాచ్ ముందు వరకూ మొదటి స్థానంలో ఉన్న కోల్‌కతా 8 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన దీపక్ చాహర్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం రాత్రి 8 గంటలకి ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య వాంఖడే వేదికగా మ్యాచ్ జరగనుంది.