విధి నిర్వహణలో కుమారుడి వివాహం సైతం లెక్కచేయని ఎమ్మెల్యే

SMTV Desk 2017-08-16 13:28:34  Bore well guntur, MLA GV Anjaneyulu, Vinukonda MLA, Guntur, Chandrasekhar

గుంటూరు, ఆగస్ట్ 16: ఓ ఎమ్మెల్యే కుమారుడి వివాహ ఏర్పాట్లను సైతం పక్కన పెట్టి, విధి నిర్వహణలో తన బాధ్యతను నిర్వర్తించారు. మంగళవారం ఉమ్మడివరంలో చంద్రశేఖర్ అనే బాలుడు బోరు బావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి వరకు నేటి ఉదయం 8.30లకి జరగాల్సిన తన కుమారుడి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లతో ఊపిరాడకుండా ఉన్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు ఈ విషయం తెలిసింది. వెంటనే పెళ్లి పనులను సైతం లెక్క చేయకుండా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బోరు బావి వద్దకు చేరుకున్న తక్షణం ఉన్నతాధికారులను, రెస్క్యూ టీం లను రంగంలోకి దింపి, ఆయన అక్కడే ఉండి బాలుడిని రక్షించేందుకు విశ్వప్రయత్నం చేశారు. కాగా, రాత్రి సుమారు 2.45 సమయంలో చంద్రశేఖర్‌ని ఎన్దీఆర్ఎఫ్ బలగాలు సురక్షితంగా బయటకు తీశారు. ఎమ్మెల్యే ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత తిరిగి గుంటూరుకు వెళ్లారు. బాలుడి కోసం బోరు బావి దగ్గరే మకాం వేసి, కుమారుడి వివాహం సైతం లెక్కచేయని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గొప్పతనాన్ని అందరూ కొనియాడుతున్నారు.