రెండు మ్యాచ్‌లకే బలహీనతల గురించి మాట్లాడడం సరికాదు!

SMTV Desk 2019-04-09 18:12:14  ipl 2019, sunrisers hyderabad, sandeep sharma, david warner

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే తరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి మళ్లీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక దీనిపై స్పందించిన సన్‌రైజర్స్ ఆటగాడు సందీప్ శర్మ మాట్లాడుతూ..."గత నాలుగు మ్యాచుల్లోనూ ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టోలు రాణిస్తుండడంతో మిడిలార్డర్‌కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ముంబైతో, గత రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మిడిలార్డర్‌కు అవకాశం వచ్చినా నిలబడలేకపోయింది. ఫలితంగా ఓటమి పాలైంది. సరిగ్గా ఇదే జట్టు కొంప ముంచుతోంది" అని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ మిడిలార్డర్‌లో యూసుఫ్ పఠాన్, మహ్మద్ నబీ, దీపక్ హుడా, మనీశ్ పాండే లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ సరైన భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోతున్నారు. అయితే, వీరిలో అద్భుతమైన నైపుణ్యం దాగుందని సందీప్ శర్మ కొనియాడాడు. ఒకటి రెండు మ్యాచ్‌లకే బలహీనతల గురించి మాట్లాడడం సరికాదంటూనే రాబోయే రోజుల్లో మంచి ప్రదర్శన చేస్తామని చెప్పాడు.