వడ్డీరేట్లను తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ

SMTV Desk 2019-04-09 13:20:18  hdfc bank, hdfc, rbi, hdfc debts interests

ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో తగ్గింపు తర్వాత ఇప్పుడు ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్‌ రేటులో కోత విధించింది. రేటు తగ్గింపు ఏప్రిల్ 8 నుంచే అమలులోకి వస్తుందని బ్యాంక్ ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ రేటు కోత కారణంగా కేవలం కొత్త రుణాలు మాత్రమే కాదు ప్రస్తుతం కొనసాగుతున్న రుణాలపై కూడా సానుకూల ప్రభావం ఉండనుంది. కొత్త రుణాలపై రేట్లు దిగివస్తే.. ప్రస్తుత రుణాలపై ఈఎంఐ భారం తగ్గుతుంది. వాహన రుణాలు, ఇంటి రుణాలు, పర్సనల్ లోన్స్‌పై రుణ వడ్డీ రేట్లు దిగి రానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకారం.. ఎంసీఎల్ఆర్ ఏడాది కాలపు రుణాలకు 8.75 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గించింది. అలాగే ఆరు నెలల రుణాలకు ఎంసీఎల్ఆర్‌ను 8.45 శాతానికి, మూడు నెలల కాలానికి ఎంసీఎల్ఆర్‌ను 8.35 శాతానికి, నెల రోజుల ఎంసీఎల్ఆర్‌ను 8.30 శాతానికి తగ్గించింది. బ్యాంకింగ్ రంగంలోని ఇతర బ్యాంకులు కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను అనుసరించనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపుతో ఇతర బ్యాంకులపై ఒత్తిడి నెలకొనే అవకాశముంది. అప్పుడు అవి పోటీలో నిలవగలవు. ఇకపోతే ఏప్రిల్ 4న ఆర్‌బీఐ రెపో రేటును 6 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉంది. కాగా రుణ రేట్లు ఎంసీఎల్ఆర్ ఆధారంగానే నిర్ణయమౌతాయనే విషయం తెలిసిందే.