ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చెట్టు ఎక్కి అక్కడే ప్రసవించిన మహిళా...

SMTV Desk 2019-04-09 13:08:36  Woman gives birth to baby girl atop a tree, Amelia and her family were caught up in the storm hence they opted to climb up a tree

మహిళా ప్రసవించింది అంటే తనకి మరో పునర్జన్మ అనే చెప్పుకోవాలి. ప్రతీ స్త్రీ తన ప్రాణాలు తెగించి మరో ప్రాణం పోస్తుంది. అయితే ఇదే తరహాలో జింబాబ్వేలో మనసు కదిలించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. తుఫాన్ ప్రభావంతో దేశం అంతా మునిగిపోయింది. దీంతో అనేక ఇండ్లల్లోకి నీరు ప్రవేశించింది. అయితే ఓ నిండుచూలాలు అయిన గర్భిణి చెట్టు ఎక్కి, అక్కడే బిడ్డను కన్నది. శిశువుతో రెండు రోజులు చెట్టు పైనే గడిపింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఇడాయ్ తుఫాను జింబాబ్వే దేశాన్ని అతలాకుతలం చేసింది. మొజాంబిక్ ప్రాంతానికి చెందిన అమేలియా అనే మహిళ ఇంట్లోకి నీరు ప్రవేశించాయి. చుట్టు పక్కల వాళ్లు కూడా ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. దీంతో ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. ఎవర్ని పిలిచినా పలికే నాథులు లేరన్నట్టే వుంది అక్కడి పరిస్థితి. తన రెండేళ్ల కొడుకును తీసుకుని దగ్గర్లో ఉన్న మామిడిచెట్టు పైకి ఎక్కి అక్కడ తలదాచుకుంది. చెట్టుపైనే పురిటి నొప్పులు వచ్చి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అలా చెట్టుపైనే రెండ్రోజులు గడిపింది. పసిబిడ్డ గుక్కపట్టి ఏడిస్తే తన రొమ్ముపాలు తాపుతోంది. కానీ ఆమె, ఆమె రెండేళ్ల కొడుకూ ఆకలికి నకనకలాడక తప్పలేదు. చలికి గజగజ వణుకుతూ ఇద్దరు పిల్లలను తన పొత్తిళ్లలో పొదివి పట్టుకుని శిలలా వుండిపోయింది. చెట్టుపైనే చాలా సేపు ఏడ్చింది. తుఫాన్ తగ్గుముఖం పట్టాక స్థానికులు ఆమెను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆమె తల దాచుకుంది. జింబాబ్వేలో 20 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే దక్షిణ మొజాంబిక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పంటి బిగువన బిడ్డల కోసం ఆ తల్లి పడ్డ రెండ్రోజుల నరకాన్ని తలుచుకుని స్థానికులు అయ్యోపాపం అంటున్నారు. తెగువతో కష్టాన్ని ఈదగల సమర్థురాలు ఆమె అని కితాబు ఇస్తున్నారు.