సొంత గూటికి చేరిన గల్ఫ్ బాధితులు...

SMTV Desk 2017-08-16 11:33:51  GULF, COMPANY, TELANGANA WORKERS ASSOCIATION, SOCIAL MEDIA,

హైదరాబాద్, ఆగస్ట్ 16 : ఎన్నో కష్టాలు పడి, తినడానికి సరిగా తిండి కూడా దొరక్క ఆరు నెలలుగా గల్ఫ్ దేశంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న బాధితులు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణకు చెందిన పలువురు కార్మికులు ఒమన్ లోని పెట్రోస్ గల్ఫ్ కంపెనీలో పని చేయడానికి వెళ్ళారు. అయితే ఆ కంపెనీ వారికి ఆరు నెలలుగా జీతాలివ్వలేదు. దీంతో ఆ కార్మికులు చేతిలో చిల్లి గవ్వ లేక, ఎటు వెళ్ళాలో దిక్కుతోచక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపధ్యంలో వారి సమస్యలను సోషల్ మీడియా ద్వారా తమ కుటుంబ సభ్యులకు వివరించడంతో వారంతా కలిసి తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కలిసి గల్ఫ్ లో వారి కుటుంబీకులు పడే కష్టాలను గూర్చి విన్నవించుకున్నారు. ఈ ప్రతినిధులు వారి సమస్యను పరిష్కరించడమే కాకుండా విమాన టికెట్లను ఏర్పాటు చేసి భారత విదేశాంగ శాఖ సహాయంతో 300 మంది కార్మికులను స్వదేశం చేర్చారు. కాగా తమ సమస్యను పరిష్కరించి, వారిని స్వదేశం చేర్చిన తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ కు వారంతా కృతజ్ఞతలను తెలియజేశారు.