జనసేనను ఎప్పుడో టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేసాడు

SMTV Desk 2019-04-09 11:25:25  YS Sharmila, Pawan Kalyan

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై వైసీపీ నేత షర్మిల విమర్శల వర్షం కురిపించారు. కాకినాడలో ఆదివారం నాటి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. చంద్రబాబు రెండు వేళ్ళు చూపించేది.. తనకు రెండు నాలుకలు ఉన్నాయని చెప్పడం కోసమేనన్నారు. నిజం చెబితే చంద్రబాబు తల బద్ధలైపోతుందని వైఎస్ అనేవారని ఆమె గుర్తు చేశారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని.. లోకేశ్‌కు మాత్రమే జాబు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవకపోయినా లోకేశ్‌కు మూడు పదవులు కట్టబెట్టారన్నారు. దేశంలో అన్ని సర్వేలు జగన్‌ సీఎం అవుతారని చెబుతున్నాయన్నారు. పవన్ కల్యాణ్ తన అన్నను ఆదర్శంగా తీసుకుని.. జనసేనను ఎప్పుడో టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేశాడని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్నాడన్నారు. మాట తప్పనివాడు మడమ తిప్పనివాడు కావాలంటే జగన్ రావాలని…చెప్పింది చేసేవాడు కావాలంటే జగన్ కావాలని షర్మిల స్పష్టం చేశారు.