బిర్యానీ కోసం కాంగ్రెస్ కార్యకర్తల ఫైటింగ్...!

SMTV Desk 2019-04-09 11:09:11  Congress supporters fight for Biryani, Congress , Nasimuddin Siddiquis election campaign in Bijnor,

ఎన్నికల సందర్భంగా ప్రచార సభల్లో అభ్యర్థులు ప్రసంగించే దాని కన్నా...అక్కడ బీర్లు, బిర్యానీలు, డబ్బులు ఇస్తారని ఎదురు చూసే వారే ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం గొడవ జరుగుతుందో అని ఎవ్వరికీ తెలీదు. అయితే ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. కాని ఇక్కడ గొడవ పడింది డబ్బుల కోసం ప్రచారానికి వచ్చిన ప్రజలు కాదు...అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అది కూడా బిర్యానీ కోసం. ఈ సంఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి. బిజ్నోర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ నవాజుద్దీన్ సిద్దిఖీకి మద్దతుగా కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు. కాక్రోలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టధేడా గ్రామంలో ఎమ్మెల్యే మౌలానా జమీల్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. సభ అనంతరం అక్కడే విందు ఏర్పాటుచేశారు. అయితే జనాల కన్నా ముందు కాంగ్రెస్ కార్యకర్తలే బిర్యానీ కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. నన్నెందుకు తోస్తున్నావంటే.. నన్నెందుకు తోస్తున్నావని వాదులాడుకున్నాడు. చిలికి చిలికి గాలివాన అయినట్టు పెద్ద ఘర్షణకు దారితీసింది. పరస్పరం కొట్టుకున్నారు. ప్లేట్లు, కుర్చీలతో దాడులు చేసుకున్నారు. బిర్యానీ పొట్లాలను చిందరవందరగా పారేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే ఈ ఘటనపై ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ముందస్తు అనుమతి లేనిదే విందు ఏర్పాటు చేసినందుకు వారిపై కేసులు పెట్టారు. ఎమ్మెల్యే జమీల్, అతని కుమారుడితో పాటు మొత్తం 34 మంది కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో టధేడా గ్రామంలో అదనపు బలగాలను తరలించి పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది.