ఓటర్లలో చైతన్యం పెంచడం కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌

SMTV Desk 2019-04-08 20:41:16  Voter Mobile app,

దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి కనిపిస్తోంది. మొదటి విడత పోలింగ్‌కు గడువు దగ్గరపడుతోంది. ఓటర్ల కోసం అనే యాప్స్‌ని రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్. అందులో ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌ ఒకటి. ఫిబ్రవరిలో లాంఛ్ చేసిన యాప్ ఇది. ఓటర్లకు కావాల్సిన సమాచారం, సేవలన్నీ ఈ యాప్‌లో లభిస్తాయి. దేశంలోని ప్రజలంతా ఎన్నికల్లో ఆసక్తిగా పాల్గొనే సంస్కృతిని పెంపొందించడంతో పాటు ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందించడానికి ఈ యాప్ రూపొందించినట్టు భారత ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో ఉన్న డేటా అంతా మొబైల్ అప్లికేషన్‌లో కనిపిస్తుంది. ఓటర్లలో చైతన్యం పెంచడమే ఈ యాప్ ప్రాథమిక లక్ష్యం.

ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో మీకు కావాల్సిన సేవలు, సమాచారం పొందడానికి మీ EPIC నెంబర్ కీలకం. 18 ఏళ్లు నిండిన భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించినప్పుడే EPIC నెంబర్ జారీ చేస్తుంది ఎన్నికల కమిషన్. EPIC నెంబర్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన మీ వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా పొందొచ్చు. ఓటరు జాబితా తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని సబ్మిట్ చేయొచ్చు. ఓటరు కార్డులో కరెక్షన్స్, అడ్రస్ మార్పు, నియోజకవర్గం మార్పు లాంటివన్నీ సాధ్యం. అంతేకాదు... మీ దరఖాస్తు స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అభ్యర్థుల సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఎన్నికలు, ఫలితాలకు సంబంధించి ఫిర్యాదులు కూడా చేయొచ్చు