ఎన్నికల ఎఫెక్ట్!... బజారుకెక్కిన నటుడు నాజర్ కుటుంబ వ్యవహారం!

SMTV Desk 2019-04-08 20:35:32  Nazar, Nazar wife kamili, hero nazar

ఎన్నికలంటేనే రచ్చ. దీనికి ఎవరూ అతీతం కాదు. పైగా సినిమాల వాళ్లు కూడా ఎన్నికల్లోకి వస్తే వివాదాలకు కొదవే ఉండదు. ప్రముఖ దక్షిణాది నటుడు నాజర్ ఇంట్లో నడుస్తున్న యుద్ధం తాజాగా ఎన్నికల పుణ్యమా అని బజారున పడింది. నాజర్ దంపతులపై అతని తమ్ముడు జహవర్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ‘నాజర్ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారు. తల్లిదండ్రులను కష్టపెట్టాడు. ఆయన భార్య మా కుటుంబాన్ని సర్వనాశం చేసింది.. నాజర్, ఆమె రాజకీయాల్లో వచ్చి ఏం చేస్తారు?’ అని ఆరోపించాడు

నటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ అభ్యర్థిగా నాజర్ భార్య కమీలా.. సెంట్రల్ చెన్నై నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె మరిది వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఇల్లు చక్కబెట్టుకోలోని కమీలా రాజకీయాలకు ఏం పనికొస్తారని పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. దీంతో నాజర్ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన భార్యకు ప్రత్యేక అస్తిత్వం ఉందని, ఆమెను తనకు ముడిపెట్టి అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

‘కుటుంబ విషయాలు వీధికెక్కాయి. కమీలకు ఓట్లు పడకుండా ఓ ముఠా ప్రచారం చేస్తోంది. కొందరి రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు. ఆమె నా కట్టుబాట్లలో లేదు. ఆమెకు సొంత ప్రతిభ ఉంది. నేను ఏమీ చేయలేదన్న ఆరోపణలు అసత్యం. నేను నా 40 ఏళ్ల కెరీర్‌లో ఏం చేశానో చెప్పడానికి ఇది సమయం కాదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను. మా కుటుంబంలోని ఒకరి వల్ల నా బాధ్యతలకు అడ్డుకట్ట పడింది. కానీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కమీలను తిట్టడానికి ఏమీ లేక ఇలా చేస్తున్నారు. ఎన్నికలు తర్వాత పూర్తి వివరణ ఇస్తాను.. ’ అని పేర్కొన్నారు.