65,000 హెచ్1బి వీసాల జారీకి చట్టసభల ఆమోదం

SMTV Desk 2019-04-08 17:29:24  h1b visa, america,

వాషింగ్టన్: అమెరికాలో అత్యంత కీలకమైన వర్క్ పర్మిట్ల హెచ్ 1 బి వీసాలపై పరిమితికి దరఖాస్తులు సంఖ్య దాటింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 65,000 హెచ్1బి వీసాల జారీకి చట్టసభల ఆమోదం దక్కిందని దేశ పౌరసత్వ, వలస సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) వెల్లడించింది. ఈ వీసా పరిధిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టినట్లు ఈ విభాగం అధికారికంగా తెలిపింది. విదేశీయులు, అత్యధిక సంఖ్యలో భారతీయ ఐటి ఇతర వృత్తినిపుణులు ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ కోణంలో ఈ వీసాల జారీ ప్రక్రియ , ఏ సంఖ్యలో వీటిని అందిస్తారనేది కీలకమైన అంశంగా మారింది. హెచ్ 1 బి వీసాలున్న వారినే అమెరికా కంపెనీలు ఉద్యోగాలలోకి తీసుకునేందుకు వీలుంది. ప్రత్యేకించి భారత్, చైనాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది సాంకేతిక విద్యాధికులను అమెరికా ఐటి దిగ్గజ సంస్థలు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలలోకి తీసుకుంటాయి. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరించేందుకు అమెరికా కాంగ్రెస్ నుంచి ఆమోదం దక్కిందని సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ వారు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి అమెరికా ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది.

ఈ నెల 4వ తేదీనుంచే వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయిందని అధికార వర్గాలు వెల్లడించాయి. గత నాలుగు అయిదు రోజులలో ఎన్ని దరఖాస్తులు అందాయనే విషయాన్ని యుఎస్‌సిఐఎస్ అధికారికంగా తెలియచేయలేదు. అయితే ఇప్పటికే వీసాల పరిమితి సంఖ్యను మించి దరఖాస్తులు అందినట్లు వెల్లడయింయుఎస్ అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపులకు సంబంధించిన మాస్టర్స్ క్యాప్ 20000గా ఖరారు చేశారు. ఈ సంఖ్యకు అనుగుణంగా దరఖాస్తులు అందిందీ లేదని తాము నిర్థారించుకోవల్సి ఉంటుందని వెల్లడించారు. హెచ్ 1 బి వీసా దరఖాస్తులన్నింటినీ స్వీకరించడం జరుగుతుందని, అయితే తిరస్కరించిన వాటికి వీసా ఫీజులు తిరిగి ఇచ్చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎవరైనా ఎన్నిసార్లు అయినా దరఖాస్తులు చేసుకోవచ్చు. జారీ పరిమితిని బట్టి దరఖాస్తుల తగు పరిశీలన, వాటి ఆమోదం, వీసాల జారీ ఉంటుందని వివరించారు. గత కొద్ది సంవత్సరాలుగా అమలులో ఉన్న కంప్యూటర్ ప్రక్రియయుత లాటరీ విధానాన్ని ఈసారి కూడా పాటించడం జరుగుతుందా? లేదా అనేది వెల్లడించలేదు. యుఎస్ వర్క్ పర్మిట్లకు సంబంధించి పలు నూతన నిబంధనలను తీసుకువచ్చిన తరువాత హెచ్ 1 బి వీసాల దరఖాస్తుల దశ ఆరంభం ఇదే తొలిసారి.

దీనితో వీసాల జారీపై ఆశలు పెట్టుకునే వారు పలు స్థాయిలలో నిబంధనలకు కట్టుబడి దరఖాస్తులను సమర్పించుకోవల్సి ఉంటుంది. ఇక గత ఏడాది అమెరికా వీసాల విభాగానికి 1,90,000 హెచ్ 1 బి వీసా పిటిషన్లు అందాయి. ఇంకా కొనసాగుతోన్న 2018 ఆర్థిక సంవత్సరంలో 1,99,000 వీసా దరఖాస్తులు అందాయి. అయితే 2017లో రికార్డు స్థాయిలో దరఖాస్తుల స్వీకరణల తొలి ఐదు రోజుల్లోనే 2,38,000 దరఖాస్తులు అందాయి. అమెరికాలో తాజాగా తీసుకువచ్చిన వీసా నిబంధనల మేరకు ఈ వీసాల జారీలో స్థానిక విద్యాసంస్థలలో పిజి చేసిన వారికే ప్రాధాన్యత ఉంటుంది. తేలిక పాటి, విచక్షణాయుత మార్పులు చేర్పులను చేపట్టినట్లు, దీనితో ఉద్యోగాలు కల్పించేవారికి , వారు తీసుకోదల్చిన విదేశీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని వీసా విభాగం డైరెక్టర్ ఎల్. ఫ్రాన్సిస్ సిస్నా ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థకు చెందిన మధ్యవర్తుల ప్రమేయంతో ఈ హెచ్ 1 బి వీసా ప్రక్రియ మెరుగు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.