‘అరె భాయ్.. నీవు ఐపీఎల్‌ క్రికెటర్‌వా? లేక గల్లీ క్రికెట్‌ర్‌వా?'

SMTV Desk 2019-04-08 16:09:49  Siraj trolling

ఆటను ఆటగా చూసే పరిస్థితి లేదిప్పుడు. ఆటకు దేశభక్తి కూడా తోడైంది. లోకల్, నాన్‌లోకల్ సెంటిమెంట్లూ ఉంటాయి. తమ వీరాభిమాన జట్టు గెలిస్తే మిన్నంటేలా సంబరాలు చేసుకునే జనం.. ఆ జట్టు ఓడిపోతే ఏమాత్రం సహించలేరు. పైగా ఆటగాళ్లు చేసిన పొరపాట్లే మళ్లీమళ్లీ చేస్తే అసలు ఊరుకోరు. పేసర్ మహ్మద్ సిరాజ్‌పై సోషల్ మీడియాలో సాగుతున్న ట్రోలింగే దీనికి ఉదాహరణ.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న సిరాజ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏమాత్రం రాణించలేకపోయాడు. ఆర్సీబీ.. 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీనికి కారణం సిరాజేనని ఆర్సీబీ అభిమానులు తిడుతున్నారు.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ చెలరేగి కొండంత లక్ష్యాన్ని నిర్దేశించారని, అయితే బౌలర్లు నీరుగారిపోయారని అంటున్నారు. సిరాజ్ కనిపిస్తే రాళ్లతో కొడతామంటూ రాళ్లుపట్టుకున్న ఫొటోలను పోస్టుతున్నారు.

4 వరుస ఓటములతో దెబ్బతిన్న అభిమానులు.. గెలుస్తుందనుకున్న మ్యాచ్ కూడా ఆటగాళ్లు చేజార్చుకోవడంతో ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సిరాజ్‌ ఏమాత్రం సత్తా చూపలేకపోయాడని, రెండు కీలక క్యాచ్‌లు మిస్ కావడమేకాక, ప్రత్యర్థికి భారీగా పరుగులు సమర్పించుకున్నాడని అంటున్నారు. క్రిస్‌ లిన్‌ భారీ షాట్‌ బాదగా బౌండరీ లైన్‌ వద్ద అతి సులభమైన క్యాచ్‌ను సిరాజ్‌ విడిచిపెట్టాడని విమర్శిస్తున్నారు. ఆటలో అతని వైఫల్యాలను తూర్పరబడుతూ లోగోలు, ఫన్నీ మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అరె భాయ్.. నీవు ఐపీఎల్‌ క్రికెటర్‌వా? లేక గల్లీ క్రికెట్‌ర్‌వా?. నీకెందుకు భయ్యా క్రికెట్, బౌలింగ్‌ రాదు.. ఫీల్డింగ్‌ రాదు, ఇంటికెళ్లి రెస్ట్ తీసుకో..’ అని అంటున్నారు. దారి కాచి రాళ్లు పట్టుకుని చూస్తున్న ఫొటోలు వెల్లువలా వచ్చేస్తున్నాయి.