రాజకీయ ప్రకటనలపై ఈసీ గైడ్‌లైన్స్

SMTV Desk 2019-04-08 16:08:03  ec

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చివరి రెండు రోజులు చేసే రాజకీయ ప్రకటనలపై ఈసీ గైడ్‌లైన్స్ ప్రకటించింది. ఏడు విడుతలుగా జరుగనున్న ఈ ఎన్నికల్లో.. ప్రతి విడుత పోలింగ్ రోజుతోపాటు ఆ ముందు రోజు స్క్రీనింగ్ కమిటీలు ధ్రువీకరించని యాడ్స్‌ను ప్రచురించకుండా ఈసీ నిషేధం విధించింది. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఈసీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది.

అయితే ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం కొత్తదేమీ కాదు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే ఈసీ తొలిసారి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది. పోలింగ్ రోజు, ఆ ముందు రోజు రాజకీయ అడ్వైర్టెజ్‌మెంట్లను ప్రచురించకుండా నిషేధం విధించాలని ఈసీ ప్రతిపాదించింది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి న్యాయ శాఖ ముందు పెండింగ్‌లో ఉన్నది. ఎన్నికల చివరి దశలో ప్రచురించే అడ్వైర్టెజ్‌మెంట్లు స్వభావరీత్యా దురుద్దేశపూరితమైనవిగా, ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉంటున్నట్టు గతంలో తమ దృష్టికి వచ్చిందని ఈసీ పేర్కొంది. ఇటువంటి ప్రకటనల వలన మొత్తం ఎన్నికల ప్రక్రియకే దెబ్బ తగులుతున్నదని, అటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు వివరణ ఇచ్చేందుకు, లేదా ఆరోపణలను తోసిపుచ్చేందుకు అవకాశం ఉండదని తెలిపింది. విద్వేషపూరితమైన లేదా రెచ్చగొట్టే ప్రకటనల వల్ల అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిరోధించేందుకు వీలుగా అన్ని దశల్లో పోలింగ్ రోజు, ఆ ముందు రోజు స్క్రీనింగ్ కమిటీలు సర్టిఫై చేయని రాజకీయ అడ్వైర్టెజ్‌మెంట్ల ప్రచురణపై నిషేధం విధించామని ఈసీ స్పష్టం చేసింది.