కోవెలమూడిపై మళ్లీ ఐటీ రైడ్స్

SMTV Desk 2019-04-04 21:42:36  IT raids,

ఏపీలో వాడి వేడిగా ఎన్నికల ప్రచారం సాగుతుంది. అందులో భాగంగా ఆయా పార్టీల నాయకులు ప్రచారంలో మునిగితేలుతున్నారు. అదే సమయంలో టీడీపీలోని పలువురు నాయకులపై కేంద్రం ఐటీ రైడ్స్ జరుపుతుందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపన్ను శాఖ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్ననే టీటీడీ చైర్మన్‌, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేయగా.. ఈరోజు గుంటూరు జిల్లాలోని ప్రముఖ వ్యాపారి, టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ఇళ్లు, కార్యాయాల్లో ఐటి అధికారులు దాడులు చేశారు. ఒకే సమయంలో ఇల్లు, ఆఫీసులపై దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు.

అయితే తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. టీడీపీ నేత రవీంద్ర గ్యాస్‌, పెట్రోల్‌ బంకుల నిర్వాహకుడిగా స్థానికులకు సుపరిచితుడు. కాగా కోవెలమూడిపై ఐటీ దాడులు జరగడం ఇది రెండోసారిగా చెప్పవచ్చు. అదేవిధంగా తమ పార్టీ నేతల ఇళ్లే లక్ష్యంగా చేసుకొని ఐటి దాడులు జరుగుతున్నట్లు టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల సమయంలో ఐటీ దాడులతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లే తెలుస్తోంది.