కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

SMTV Desk 2019-04-04 16:44:20  elections, lok sabha

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం, వీవీప్యాట్‌ల వినియోగం వల్ల ఓటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండడంతో పోలింగ్‌ సమయాన్ని గంట పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసే పోలింగ్‌ ప్రక్రియను ఆరు గంటల వరకు పెంచింది. దీంతో సాయంత్రం ఆరు గంటల సమయానికి పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్న ప్రతి ఒక్క ఓటరుకు ఎంత రాత్రయినా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు.

వీవీ ప్యాట్‌ను అనుసంధానం వలన ఓటరు తాను ఎవరికి ఓటు వేశానో వారికి పడిందా? లేదా? అని పరిశీలించుకునే అవకాశం కల్పిస్తున్నారు. వీవీప్యాట్‌లో స్లిప్‌ కనిపించి వెళ్లేందుకు ఏడు సెకన్ల సమయం పడుతుంది. దీనివల్ల ఓటర్లు ఓటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా వేసవి కాలం, ఎండలు ఎక్కువగా ఉండడంతో సాయంత్రం కాస్త వాతావరణం చల్లబడ్డాక పోలింగ్‌ కేంద్రానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈసారి ఓ గంట అదనపు సమయాన్ని కేటాయించిందని, దీనివల్ల గరిష్టంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.