జయప్రద కన్నీరు ఎందుకు పెట్టుకుందో తెలుసా ?

SMTV Desk 2019-04-04 16:39:29  Jayaprada,

సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో దేశంలో రాజకీయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నామినేషన్లు... ప్రచారాలు తీవ్రంగా నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ రామ్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద ఈరోజు కన్నీటి పర్యంతమయ్యారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత రామ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్‌ మూలంగా తాను రామ్‌పూర్‌ని విడిచి పెట్టాల్సి వచ్చిందని.. అతను తన మీద యాసిడ్‌ పోస్తానని బెదిరించాడని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. అది చూసి చలించిన జనాలు.. బాధపడకండి.. మేం అంతా మీకు తోడుగా ఉంటామంటూ ఆమెను ఓదార్చారు.

ఆ తర్వాత తనను తాను సముదాయించుకున్న జయప్రద... ప్రసంగాన్ని కొనసాగించారు. కానీ తొలిసారి ఈ రోజు తాను చాలా ధైర్యంగా ఉ‍న్నానని.. ఎందుకంటే తన వెనక బీజేపీ ఉందని ఆమె వివరించారు. గతంలో తానెప్పుడు ఇలా ఏడ్వలేదని..తనకు బతికే హక్కు ఉందిని జీవిస్తానని.. మీకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించండి అని ఆమె తెలిపారు. అదేవిధంగా.. మహిళలకు రక్షణ, గౌరవం లభించే పార్టీలో చేరినందుకు తనకు చాలా గర్వంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా జయప్రద 2004, 2009లో రాంపూర్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు. అంతేకాకుండా 2014లో రాష్ట్రీయ లోక్‌ దళ్‌ అభ్యర్థిగా బిజ్‌నోర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.