రఫేల్ ఒప్పందంపై పుస్తకావిష్కరణకు బ్రేక్

SMTV Desk 2019-04-04 16:31:57  rafale

సార్వత్రిక ఎన్నికల ఎఫెక్టు ఓ పుస్తకంపై పడింది. ఎన్నికల సందర్భంగా పలు సినిమాలు, ప్రచారాలపై ఆంక్షలు విధిస్తోంది ఎన్నికల సంఘం(ఈసీ). ఈ క్రమంలో దేశాన్ని కుదిపేసిన రఫేల్‌ వివాదంపై ప్రముఖ ఇంజినీర్‌ విజయన్‌ రాసిన పుస్తక ఆవిష్కరణను ఎన్నికల సంఘం అడ్డుకుంది. చెన్నైలోని ఓ పుస్తక విక్రయ కేంద్రంలో రఫేల్‌కు సంబంధించిన దాదాపు 150 పుస్తకాలను ఈసీ తనిఖీల్లో స్వాధీనం చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి వెళ్లింది. ఈ విషయమై ఆయన స్పందించారు. పుస్తకాల స్వాధీనానికి సంబంధించి భారత ఎన్నికల సంఘంగానీ, తమిళనాడు ఎన్నికల అధికారి కార్యాలయంగానీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించామని వెల్లడించారు.

భారతీయ పుస్తకాలయం అనే ఈ పుస్తక కేంద్రం సీపీఐ పార్టీకి అనుబంధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆవిష్కరణకు ముందే ఈ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ హిందూ పత్రిక జర్నలిస్ట్‌ ఎన్‌.రామ్‌.. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలోని పలు కీలక పత్రాలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకాన్ని ఆయన చెన్నైలోని ఓ పాఠశాలలో ఆవిష్కరించాలని అనుకున్నారు. అయితే ఎన్నికల కోడ్‌ పేరిట ఈసీ అధికారులు పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అనంతరం పుస్తక ప్రచురణ సంస్థ భారతి పబ్లికేషన్ కార్యాలయంలోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సి వచ్చింది. దీనిపై రామ్‌ ఘాటుగా స్పందించారు. ఏ చట్టం ఆధారంగా పుస్తక ఆవిష్కరణను అడ్డుకున్నారని ప్రశ్నించారు. స్వాధీనం చేసుకున్న పుస్తకాలను తిరిగి ఆవిష్కరణకు ముందు ఇచ్చేసినట్లు తెలుస్తోంది.