వైఎస్సార్ కాంగ్రెస్ నేతకు బెదిరింపు కాల్స్

SMTV Desk 2019-04-04 16:31:02  Mohanbabu,

గుర్తుతెలియని నంబర్స్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ నేత మోహన్‌బాబు పోలీసులను ఆశ్రయించారు. మార్చి 26 నుంచి తనకు బెదిరింపుకాల్స్ వస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు ఫిర్యాదుపపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా పోలీసుల విచారణలో మోహన్‌బాబుకు వస్తున్న కాల్స్ ఇతర దేశాల నుంచి వస్తున్నట్లు గుర్తించారు.

విదేశాలకు చెందిన సిమ్‌కార్డుల నుంచి ఆయనకు కాల్స్ వస్తున్నాయని పోలీసు అధికారులు వివరిస్తున్నారు. దీనిపై తదుపరి చర్యల కోసం న్యాయ సలహా తీసుకుంటామని, ప్రస్తుతానికి మోహన్‌బాబు ఇచ్చిన ఫిర్యాదును లీగల్ సెల్‌కు పంపించామని దర్యాప్తు అధికారులు వివరిస్తున్నారు. ఇదిలాఉండగా చంద్రబాబు ప్రభుత్వం తన విద్యాసంస్థలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించడంలేదని ఆరోపిస్తూ నటుడు మోహన్‌బాబు ధర్నా కార్యక్రమం చేపట్టాడు. ఆ తరువాత మోహన్‌బాబు వైఎస్సార్ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో తనపై కక్షకట్టిన టిడిపి వర్గాల వారు ఫోన్లో బెదిరిస్తున్నారని మోహన్‌బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.