ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు!

SMTV Desk 2019-04-03 18:25:53  kcr, trs

సంగారెడ్డి : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తాజాగా అల్లాదుర్గంలో జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీబీ పాటిల్ మంచి వ్యక్తి అని, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడని, అవినీతికి దూరంగా ఉండే బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. చిన్న, పెద్ద రైతు అని తేడా లేకుండా రైతు బీమా అమలు చేస్తున్నామన్నారు. తాను కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డనే అని కెసిఆర్ అన్నారు. తాను ఎన్ని సార్లు పాదయాత్ర చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసునని చెప్పారు. జహీరాబాద్ నిమ్స్ పూర్తయితే రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని, నిమ్స్ పూర్తయితే జహీరాబాద్‌కు పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుందని వెల్లడించారు. ఏడు లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని స్పష్టం చేశారు. ఎన్నికలు చాలా వస్తాయని చాలా మందిని గెలిపించారని, ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని, ఎవరు ఏం చెప్పినా విని మంచి చెడు ఆలోచన చేయాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలువుతున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ పూర్తి కావొస్తుందని, మిషన్ భగీరథ లాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదన్నారు. వచ్చే నెల నుంచి పెంచిన పెన్షన్ ఇస్తామని తెలిపారు. రైతుబంధు కింద ఇక నుంచి ఏడాదికి ఎకరానికి పది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎర్ర నేలలు, నర్రనేలలు కలిగిలిసిన ప్రాంతం జహీరాబాద్ అన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సింగూరు నీళ్లిచ్చామని గుర్తు చేశారు. కౌలాస్ నాలా, లెండి కాల్వలను బాగు చేస్తామని అవసరమైతే లెండి వాగుపై బ్రిడ్జికమ్ చెక్ డ్యామ్ కడుతామని హామీ ఇచ్చారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ త్వరలో పూర్తవుతుందని, మల్లన్న సాగర్ ద్వారా నారాయణఖేడ్ సస్యశ్యామలం అవుతుందని, సింగూరు ప్రాజెక్టు మీద జహీరాబాద్‌కు హక్కు ఉందని తెలియజేశారు. సింగూరు మీద లిఫ్ట్‌లు పెట్టి జహీరాబాద్‌లో లక్ష ఎకరాలకు నీరందిస్తామని, నారాయణఖేడ్‌లో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో దేశం బాగుపడటం లేదని, కాంగ్రెస్, బిజెపిలు ఒకరినొకరు నిందించుకుంటున్నారే తప్ప, ఒకరు చోర్ అంటే ఇంకొకరు బడా చోర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బిజెపి కొట్లాట వెనుకున్న కిటుకేంటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పాలన చూడంది కాదని, బిజెపి పాలన అట్లర్ ఫ్లాప్ అయిందని విమర్శలు గుప్పించారు. మనం ఎవరితో కలవలేమని, మన బతుకు మనం బతుకుతున్నామన్నారు. ఎవరితోనూ లోపాయికారి ఒప్పందం చేసేకునే అవసరం మాకు లేదని చెప్పారు.