కేసీఆర్ ప్రధాని కావాలి!

SMTV Desk 2019-04-03 15:20:11  kadiyam srihari, kcr, trs, telangana loksabha elections, bjp

వరంగల్ : రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మోడీ ప్రభుత్వం విభజన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనే మార్లు కోరిన పిఎం మోడీ పెడచెవిన పెట్టడమే కాకుండా తెలంగాణపై వివక్ష చూపారని విరుచుకపడ్డారు. లింగంపల్లి రిజర్వాయర్ పూర్తి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి రెండు పంటలకు సాగు నీరు అందుతుందని కడియం పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో మోడీ ప్రభుత్వం పూర్తి విఫలమైందని దుయ్యబట్టారు. కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీకి సరైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి, దూరదృష్టితో పని చేసే సిఎం కెసిఆర్ నాయకత్వం దేశానికి అవసరం ఉందని కడియం సూచించారు. సిఎం కెసిఆర్ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని వివరించారు. సమస్యలపై అవగాహన ఉండి…. వాటిని చిత్తశుద్ధితో పరిష్కరించే సత్తా ఉన్న సిఎం కెసిఆర్ దేశానికి ప్రధాని కావాలన్నారు.