మిషన్ శక్తి ప్రయోగంపై నాసా సంచలన ఆరోపణలు

SMTV Desk 2019-04-03 15:05:23  Nasa, mission shakthi

గత వారం భారత్ నిర్వహించిన మిషన్ శక్తి ప్రయోగంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంచలన ఆరోపణలు చేసింది. మిషన్ శక్తిని ఒక భయంకరమైన చర్యగా అభివర్ణించిన నాసా.. ఈ యాంటీ శాటిలైట్‌ ప్రయోగంతో అంతరిక్షంలో దాదాపు 400 ఉపగ్రహ శకలాలు(వ్యర్థాలు) ఏర్పడ్డాయని ప్రకటించింది. ఈ వ్యర్థాల వలన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్‌)కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నాసా చీఫ్ జిమ్ బ్రీడెన్‌స్టీవ్ అన్నారు. ఇప్పటివరకు పెద్ద పరిణామంలో ఉన్న వ్యర్థాలను మాత్రమే గుర్తించామని, వాటిలో 10సెంటీమీటర్లకుపైగా పరిణామం ఉన్న 60శకలాలు ఉన్నాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం అంతరిక్షంలో 23,000 వ్యర్థాలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయని నాసా తెలిపింది. వాటిలో 3వేల వ్యర్థాలు 2007లో చైనా చేపట్టిన యాంటీ శాటిలైట్ ప్రయోగం వల్ల ఏర్పడ్డాయని వివరించింది. ఇక తాజాగా భారత్ చేసిన ప్రయోగం వలన అంతరిక్ష కేంద్రాన్ని వ్యర్థాలు ఢీకొట్టే ప్రమాదం 44 శాతం ఎక్కువైందని నాసా మండిపడింది.

ప్ర‌స్తుతం ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్ తిరుగుతున్న క‌క్ష్యకు దిగువ క‌క్ష్య‌లోనే భార‌త్ ఓ శాటిలైట్‌ను పేల్చింది. చాలా ఉప‌గ్ర‌హాలు ఆ క‌క్ష్య క‌న్నా పైనే తిరుగుతున్నాయి. అయినా ఇలాంటి పేలుళ్ల‌కు పాల్ప‌డితే.. భ‌విష్య‌త్తులో అంత‌రిక్షంలోకి మాన‌వుల‌ను తీసుకువెళ్లే ప్ర‌యోగాల‌ను నిర్వ‌హించ‌లేమ‌ని నాసా స్పష్టం చేసింది.

అయితే మిషన్ శక్తి ప్రయోగం ద్వారా అంతరిక్షంలో అనితర సాధ్యమైన పనిని భారత్ సాధించిందని.. ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాతి స్థానంలో భారత్ నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే.