కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

SMTV Desk 2019-04-03 13:23:23  kcr, kishna reddy,

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సికిందరాబాద్‌ బిజెపి లోక్‌సభ అభ్యర్ధి కిషన్ రెడ్డి కొన్ని సూటి ప్రశ్నలు సందించారు. “లోక్‌సభ ఎన్నికలలో 16 ఎంపీ సీట్లు గెలిస్తే దేశంలో ప్రాంతీయ పార్టీలను అన్నిటినీ కలుపుకొని డిల్లీలో చక్రం తిప్పుతానని చెప్పుకొంటున్న మీతో (కేసీఆర్‌) చేతులు కలపడానికి ఎవరైనా సిద్దంగా ఉన్నారా? ఉంటే వారు బహిరంగంగా మీకు ఎందుకు మద్దతు ఈయడం లేదు? మీతో కలిసి పనిచేస్తాయని మీరు చెప్పుకొంటున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమాద్మీ అధినేత డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యూపీలో అఖిలేశ్, మాయావతి కూడా మీకు మద్దతు ఇస్తామని చెప్పలేదు. మీ వెనుక ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే ఉన్నట్లు కనిపిస్తున్నారు. మీతో కలిసిపని చేయబోతున్న ప్రాంతీయ పార్టీల నేతలెవరూ తెలంగాణకు వచ్చి తెరాస తరపున ఎందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంలేదు? వారెవరినీ మీరు ఎందుకు ఆహ్వానించలేదు?” అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, బిజెపి ఎంపీ బండారు దత్తాత్రేయ కూడా సిఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. డిల్లీలో చక్రం తిప్పుతానని సిఎం కేసీఆర్‌ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ లోక్‌సభ ఎన్నికలతోనే రాష్ట్రంలో తెరాస పతనం ప్రారంభం కాబోతోందని అన్నారు. అవినీతితో మునిగితేలుతూ నిరంకుశ కుటుంబ పాలన సాగిస్తున్న తెరాస భరతం పడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సిఎం కేసీఆర్‌ను హెచ్చరించారు.