పవన్ కళ్యాణ్ vs మోహన్ బాబు

SMTV Desk 2019-04-03 13:18:30  Pawan Kalyan, Mohan babu

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. నాయకుల మధ్య మాటల తూటాలు గట్టిగానే పేలుతున్నాయి. ఏపీలో ప్రధాన ప్రత్యర్ధులుగా చెప్పుకుంటున్న టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రబాబు, జగన్ ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటుంటే... మిగతా నాయకులు సైతం వారికి ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల వైసీపీలో చేరిన సినీనటుడు మోహన్ బాబు సైతం టీడీపీ చంద్రబాబును ఓ రేంజ్‌లో విమర్శిస్తున్నారు. టీడీపీని తనదైన స్టయిల్లో టార్గెట్ చేస్తున్నారు.

అయితే టీడీపీని విమర్శించడంలో ముందుంటున్న మోహన్ బాబు... జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జోలికి మాత్రం వెళ్లకపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే మోహన్ బాబు ఈ రకమైన స్టాండ్ తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. తాను పవన్ కళ్యాణ్, జనసేనను టార్గెట్ చేస్తే... అవి కేవలం రాజకీయ విమర్శలుగానే మిగిలిపోవని మోహన్ బాబు భావిస్తున్నట్టు సమాచారం. అలా జరిగితే టీడీపీని విమర్శించాలనే తన లక్ష్యం నెరవేరదని ఆయన అనుకుంటున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీకి జనసేన ప్రధాన ప్రతిపక్షం కాదని... అందుకే ఆయన జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా మోహన్ బాబు పవన్ కళ్యాణ్‌, జనసేనపై విమర్శలు చేయొద్దని నిర్ణయించుకున్నట్టుగా ఉందని కొందరు చర్చించుకుంటున్నారు.

గతంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేసిన మోహన్ బాబుపై పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ఫైర్ అయ్యారు. తమ్ముడు మోహన్ బాబు అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. అలా కొంతకాలం పాటు మెగాస్టార్‌తో మోహన్ బాబు కోల్డ్ వార్ కంటిన్యూ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మళ్లీ స్నేహసంబంధాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యలో పవన్ కళ్యాణ్‌ను విమర్శించడం ద్వారా మరోసారి మెగా ఫ్యామిలీతో విభేదాలు తెచ్చుకోవడం ఇష్టంలేకే మోహన్ బాబు జనసేన, పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.