జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10 వేల చొప్పున డబ్బు

SMTV Desk 2019-04-03 13:17:36  10000 rupees, jandhan

ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం ఏరులై పారుతుంటాయి. వీటికి చెక్ పెట్టడానికి ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో పార్టీలు అడ్డదారుల్లో తాయిలాలకు తెరతీస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లతో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేగింది. వందలాది జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10 వేల చొప్పున డబ్బు వచ్చి పడుతోంది.

మోరదాబాద్‌ జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో 1700లకుపైగా జన్‌ధన్‌ ఖాతాల్లో కొన్నాళ్లుగా రూ. 10 వేల చొప్పున డబ్బు క్రెడిట్ అయింది. మొత్తం రూ. 1.7కోట్లు జన్‌ధన్‌ ఖాతాల్లోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎవరు డబ్బులు వేశారో కనుక్కోడానికి ఆదాయపు పన్నుశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఓట్ల కోసమే ఈ డబ్బులు వేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు, పార్టీలు, థర్డ్ పార్టీలు ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ప్రజల ఆధార్, బ్యాంకు వివరాలు సేకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓటర్లు తమ బ్యాంకు వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని, కొందరు వాటిని దుర్వినియోగం చేసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.