అఖిలేష్ యాదవ్‌కు రూ. 2.13 కోట్లు అప్పు

SMTV Desk 2019-04-03 12:34:16  Mulayam Singh Yadav,

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు... ప్రస్తుత ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు రూ. 2.13 కోట్లు అప్పు తీసుకున్నారట. మెయిన్‌పూరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ములాయం సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన ఈ అప్పుకు సంబంధించిన వివరాలు బయటపెట్టారు. తనకు సొంత కారు కూడా లేదని, కొడుకు అఖిలేశ్ యాదవ్ దగ్గర రూ.2.13 కోట్ల అప్పు తీసుకున్నానని పేర్కొన్నారు సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్. అఫిడవిట్‌లో తన మొత్తం స్థిర, చరాస్తులను రూ.16.52 కోట్లుగా చూపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పోలిస్తే ఇది రూ. 3.20 కోట్లు తక్కువ. ఈ అఫిడవిట్ ప్రకారం ములాయం ఏటా రూ.32.02 లక్షలు సంపాదిస్తుండగా.. ఆయన భార్య సాధనా యాదవ్ రూ.25.61 లక్షలు ఆర్జిస్తున్నారు. సాధనా యాదవ్ ఆస్తులను రూ.5.06 కోట్లుగా ములాయం చూపించారు. అఫిడవిట్ ప్రకారం ములాయం పేరు మీద కారు కూడా లేదు. ఆయన భార్యకు మాత్రం విలాసవంతమైన కారు ఉంది.ఇక 2015, సెప్టెంబర్ 24న తనపై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైనట్లు కూడా ములాయం వెల్లడించారు. ఫోన్లో ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్‌ను బెదిరించిన కారణంగా ఈ కేసు పెట్టారు.

నామినేషన్ సందర్భంగా మాట్లాడిన ములాయం... తాను ప్రధాని రేసులో లేనని స్పష్టంచేశారు. ఎస్పీబీఎస్పీ కూటమి తరఫున ఎవరు ప్రధాని అభ్యర్థి అని ప్రశ్నించగా.. అది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామన్నారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఈ ఎన్నికల్లో ములాయం గెలుస్తారన్నారు అఖిలేష్ యాదవ్. మెయిన్‌పురిలో కాంగ్రెస్‌తోపాటు ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిషీల్ సమాజ్‌వాదీ పార్టీలోహియా కూడా తమ అభ్యర్థులను నిలబెట్టడం లేదు.