అమితాబ్ కు జోడీగా రమ్యకృష్ణ

SMTV Desk 2019-04-03 12:25:11  Ramya Krishna, Amitabh

చెన్నయ్ : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు జోడీగా ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించనున్నారు. అమితాబ్ కోలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న సినిమా ఉయర్నత మనిథన్. ఈ సినిమా తమిళవాసన్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళం, హిందీ భాషల్లో ఒకే సారి ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దక్షిణాది సూపర్ స్టార్ రజనీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అమితాబ్ కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారని, అమితాబ్ పాత్రకు ధీటుగా ఆమె పాత్ర ఉంటుందని కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. బాహుబలిలో శివగామి పాత్రతో రమ్యకృష్ణ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం విదితమే. 1998లో అమితాబ్ , రమ్యకృష్ణ బడే మియా చోటే మియా అనే హిందీ సినిమాలో కలిసి నటించారు. 20 ఏళ్ల తరువాత వీరు మళ్లీ కలిసి కోలీవుడ్ సినిమాలో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతుందని, షూటింగ్ లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సూపర్ డీలక్స్ సినిమాలో రమ్యకృష్ణ నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రమ్యకృష్ణ నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి.