కాంగ్రెస్ మేనిఫెస్టో : హైలైట్స్ ఇవే

SMTV Desk 2019-04-02 16:05:46  Congress Manifesto,

దేశంలో అత్యంత పేదలు 25 కోట్ల మంది ఉన్నారని తేల్చిన కాంగ్రెస్ పార్టీ... ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే... నిరు పేదలందల కుటుంబాలకు నెలకు రూ.6000 చొప్పున ఏడాదికి రూ.72,000 వేల కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా ప్రకటించింది. తాము అధికారంలోకి రాగానే... న్యూతమ్ ఆయ్ యోజన (న్యాయ్‌) లేదా కనీస ఆదాయ పథకాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశంలో పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నామన్న కాంగ్రెస్... పేదరికాన్ని తరిమికొట్టేందుకు ఈ స్కీం ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని తెలిపింది.

ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... న్యాయ్ పథకాన్ని కచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు. ఐతే... బీజేపీ సహా కొన్ని పార్టీలు ఇలాంటి పథకం అమలు అసాధ్యమని అంటున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఏడాది కాలంగా ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై వివిధ నిపుణులు, ఆర్థిక వేత్తలతో చర్చించినట్లు తెలిపింది. పథకం అమలు సాధ్యమని తేలిన తర్వాతే... దీన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

యూపీఏ ప్రభుత్వ హయాంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చిన కాంగ్రెస్... దాని ద్వారా దేశంలో 14 కోట్ల మందిని పేదరిక రేఖ ఎగువకు చేర్చామని తెలిపింది. అలాంటిదే అయిన తాజా పథకం ద్వారా 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ ఎగువకు చేర్చుతామని అంటోంది. ఇందుకోసం ఏడాదికి రూ.3.6 లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా. తద్వారా దేశంలో పేదరికాన్ని తరిమికొట్టినట్లవుతోందని చెబుతూ... ఈ పథకాన్ని పేదరికంపై సర్జికల్ స్ట్రైక్‌గా అభివర్ణించారు రాహుల్.