జాన్సన్ అండ్ జాన్సన్‌ బేబీ పౌడర్‌లో ప్రమాదకర క్యాన్సర్

SMTV Desk 2019-04-02 15:50:48  jhonson and jhonson baby powder,

జాన్సన్ అండ్ జాన్సన్‌ బేబీ పౌడర్‌లో ప్రమాదకర క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఇప్పటికే తేలిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ సంస్థకు సంబంధించి మరో షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ కూడా ప్రమాదకరమైనదేనని తాజా పరీక్షల్లో తేలింది. రాజస్థాన్‌లో ఈ షాంపూపై నాణ్యతా పరీక్షలు నిర్వహించారు. బేబీ షాంపూ రెండు బ్యాచ్‌ల నమూనాల పరీక్షల్లో షాంపూలో హాని కారక పదార్థాలు ఉన్నాయని తెలియజేసింది. ఈ క్రమంలో రాజస్థాన్‌ డ్రగ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్ జె అండ్ జె కంపెనీకి మార్చి 5వ తేదీన నోటీసులు జారీ చేసింది.

ఈ షాంపూలో ప్రమాదకర ఫార్మల్‌ డిహైడ్ ఉన్నట్లు.. దానిని భవన నిర్మాణ సామగ్రి కార్సినోజెన్ తయారీలో ఉపయోగిస్తారని తెలిపింది. కాగా, ఈ విషయమై జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధి స్పందిస్తూ రాజస్థాన్‌ డ్రగ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్ ఆరోపణలను తిరస్కరించారు. తమ కంపెనీకి చెందిన ఎస్యూరెన్స్‌ ప్రాసెస్‌ ప్రపంచంలోనే అత్యంత కఠినంగా ఉంటుందని అన్నారు. అత్యంత సురక్షితంగా తమ ఉత‍్పత్తులను ఉంచుతామంటూ సమర్థించుకున్నారు. ఈ ఫలితాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థపై వేలాది కేసులు విచారణలో ఉన్నాయి. పలు కేసుల్లో భారీ నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత కోర్టులు సంస్థను అదేశించిన విషయం తెలిసిందే.