నాకు ఓటు వేయకున్నా ఫర్వాలేదు

SMTV Desk 2019-04-02 13:57:51  KA Paul,

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై కేఏపాల్ నిప్పులు చెరిగారు. తాను వైసీపీని కాపీ కొడుతున్నట్లు నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ వట్టి అబద్ధాలని అన్నారు. తాను ఎవరిని కాపీ కొట్టనని, ఆ అవసరం కూడా తనకు లేదని పాల్ పేర్కొన్నారు. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో పాల్ సోమవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించారు.

అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించిన అభ్యర్థుల్లో చాలామంది పేర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు కావాలనే కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరపున ఇదంతా చేయిస్తున్నాడని, క్రాస్ ఓటింగ్ జరగాలనే పార్టీ జెండా నుంచి అభ్యర్థులు, ఎన్నికల గుర్తు అన్నీ తమ పార్టీకి దగ్గరగా ఉండేలా చూస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దీనిపై రోడ్ షో లో మాట్లాడిన పాల్ .. ‘నాకు వేరే పార్టీలతో సంబంధం లేదు. మా పార్టీ 2008లోనే పెట్టి, జెండాను కూడా రిజిస్టర్ చేయించుకున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ 2011లో పార్టీ పెట్టి, మా పార్టీ జెండాను కాపీ కొట్టాడు. ఇప్పుడు మళ్లీ మాపైనే విమర్శలు చేస్తున్నాడు. నాకు ఓటు వేయకున్నా ఫర్వాలేదు, సైకిల్, ఫ్యాన్, గ్లాస్ గుర్తులు మాత్రం ఓట్లు వేయొద్దు. మా పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ను అమెరికా చేస్తాను’ అని కేఏ పాల్ పేర్కొన్నారు.