పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది

SMTV Desk 2019-04-02 13:47:44  pakistan,

న్యూఢిల్లీ : పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు పాక్‌కు చెందిన నాలుగు ఎఫ్‌‌-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోన్.. భారత భూభాగానికి సమీపంలో ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడర్లు గుర్తించాయి. పంజాబ్‌లోని ఖేమ్‌కరణ్ సరిహద్దు ప్రాంతంలోకి అవి వచ్చినట్లు గుర్తించిన వెంటనే భారత్‌ ప్రతిస్పందించింది. సుఖోయ్‌ ఎస్‌యూ-ఎంకేఐ, మిరాజ్‌ యుద్ధ విమానాలతో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయడంతో వెంటనే అవి పాకిస్థాన్‌ భూభాగం వైపునకు వెనుదిరిగాయి.

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాక్‌లోకి ప్రవేశించి భారత్‌ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటినుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. పాక్‌ తమ యుద్ధ విమానాలను భారత గగనతలంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సరిహద్దుకి 10 కిలోమీటర్ల దూరంలో పాక్‌ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. అప్పట్లో కూడా ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన భారత్ వైమానిక దళం పాక్‌ చర్యలను తిప్పికొట్టింది.