భారత్, పాక్ సరిహద్దు ప్రాంతంలో మళ్లీ టెన్షన్

SMTV Desk 2019-04-02 13:45:46  India, Pakistan,

భారత్, పాక్ సరిహద్దు ప్రాంతంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. బుద్ధి మారని పాకిస్థాన్ తన యుద్ధ విమానాలను భారత బోర్డర్‌కు పంపడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బయటకు ఎన్ని కబుర్లు చెప్పినా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తూనే ఉంది. దానికి తోడు పంజాబ్‌లోని పాకిస్థాన్ బోర్డర్‌లో పాక్ తమ ఎఫ్-16 యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించి, కాల్పులతో పాటు యుద్ధ విమానాలు ఉసిగొల్పుతూ తన వైఖరిని బయటపెడుతూనే ఉంది.

సరిహద్దు దగ్గర రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంఘటన మరోమారు రుజువైంది. పాక్‌కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలు బోర్డర్‌లో చక్కర్లు కొట్టాయి. విమానాలతో పాటు ఓ భారీ డోన్ భారత భూభాగానికి దగ్గర్లో ఆకాశంలో చక్కర్లు కొట్టినట్టు భారత రాడార్లు గుర్తించాయి.

పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతంలోకి పాక్ యుద్ధ విమానాలు వచ్చినట్టు గుర్తించిన వెంటనే భారత సైన్యం ప్రతిస్పందించింది. సుఖోయ్, ఎంకెఐ, మిరాజ్ యుద్ధ విమానాలతో వాటిని వెంబడించాయి. తిప్పికొట్టే ప్రయత్నం చేయడంతో అవి వెంటనే పాకిస్థాన్ భూభాగం వైపుకు వెనుదిరిగాయి. సరిహద్దులో ఉన్న గ్రామ ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. సోమవారం జరిగిన కాల్పుల్లో ఒక బాలుడు మరణించాడు. ఇలాంటి ఘటనలు మామూలుగా మారిపోయాయి.