కేసీఆర్ బాబు కు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ జగన్ కి అందింది : దేవినేని

SMTV Desk 2019-04-02 13:39:18  ysrcp, jagan, devineni uma, trs, kcr

అమరావతి, ఏప్రిల్ 02: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తానిస్తానన్న రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు రూ. 1000 కోట్లను పంపించారని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తో చేతులు కలిపిన జగన్, ఆంధ్రా ద్రోహని అభివర్ణించిన ఆయన, వీరిద్దరూ కలిసి ప్రధానితో కలిసి రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని అన్నారు.

పోలవరంపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, అసలు ఆయన ఒక్కసారైనా ప్రాజెక్టును సందర్శించారా? అని ప్రశ్నించారు. పోలవరం ఓ ఏటీఎం అని ఆయన అనడం బాధ్యతారాహిత్యమని, ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఏపీ ప్రజలను అవమానించిన మోదీకి, జులై నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లు అందించి చూపిస్తామని దేవినేని నెహ్రూ చెప్పారు. ఏపీ సర్కారు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధుల్లో ఇంకా కేంద్రం నుంచి రూ. 4,483 కోట్లు రావాల్సి వుందని, రాష్ట్రాభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా, తక్షణం ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతుల అవసరాలను తీర్చే పోలవరం ప్రాజెక్టును ఆపాలని టీఆర్ఎస్ కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, అటువంటి పార్టీతో జగన్ చేతులు కలిపారని విమర్శలు గుప్పించారు.