బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కానున్న దేనా, విజయా బ్యాంకులు

SMTV Desk 2019-04-01 16:10:42  bank of baroda, bank of baroda dena bank vijaya bank merger

ముంభై, ఏప్రిల్ 1: ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థలో మొట్ట మొదటి సారి మూడు బ్యాంకులు విలీనం కానున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయా బ్యాంకులు విలీనం కావడానికి సిద్దంగా ఉన్నాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ విలీనం అమలులోకి వచ్చింది. దీంతో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంక్ ఏర్పాటైంది.

బ్యాంకుల విలీనం.. ముఖ్యాంశాలు :

✺ బలహీనమైన బ్యాంకుల విలీనం వల్ల ఏర్పడే పటిష్టమైన బ్యాంకుల ద్వారా ఆర్థిక రంగానికి ప్రయోజనం చేకూరుతుందని, సమర్థవంతమైన పనితీరు సాధ్యమౌతుందని ఆర్థిక మంత్రి అరున్ జైట్లీ చాలా సందర్భాల్లో పేర్కొన్నారు.
✺ విలీనం నేపథ్యంలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ వ్యాపారాలు బ్యాంక్ ఆఫ్ బరోడా చేతికి వెళ్లిపోతాయి. అలాగే దేనా, విజయా బ్యాంక్ పర్మనెంట్, రెగ్యులర్ అధికారులు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులుగా మారతారు.
✺ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తర్వాత ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో మూడో అతిపెద్ద బ్యాంక్ అయ్యింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో పెద్ద బ్యాంక్‌గా నిలిచింది.
✺ బ్యాంకింగ్ రంగాన్ని పట్టిపీడిస్తున్న మొండి బకాయిల నియంత్రణ, క్రెడిట్ వృద్ధి పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
✺ విలీనం తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకు 9,500కుపైగా బ్రాంచ్‌లు, 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగులు, 12 కోట్ల మంది కస్టమర్లు ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ షీటు రూ.15 లక్షల కోట్లుగా ఉంటుంది.
✺ ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత చోటుచేసుకున్న మరో మూడు బ్యాంకుల విలీనం ఇది.
✺ దేనా, విజయా, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల విలీన ప్రకటన దగ్గరి నుంచి చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 4.7 శాతం పడిపోయింది.
✺ దేనా బ్యాంక్‌, విజయాబ్యాంక్‌లు బీవోబీ శాఖలుగా పనిచేస్తాయి. విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ కస్టమర్లను బీవోబీ కస్టమర్లుగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మార్చి30న రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.