మరో హోరాహోరీ మ్యాచ్

SMTV Desk 2019-04-01 14:06:14  kxip, delhi capitals

మొహాలి: ఐపిఎల్‌లో భాగంగా సోమవారం మొహాలీలో ఢిల్లీ క్యాపిటల్‌స కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. శనివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ రబడ సూపర్ ఓవర్‌లో అద్భుతమైన యార్కర్లు బౌల్ చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన నేపథ్యంలో సోమవారం ఇక్కడ జరగబోయే మ్యాచ్‌లో పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్‌ను అతను ఏ విధంగా అడ్డుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. క్రిస్ గేల్, లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్ లాంటి హార్డ్‌హిట్టర్లను అతను ఏ విధంగా నిలువరిస్తాడో వేచి చూడాల్సి ఉంది. శనివారం జరిగిన మ్యాచ్‌లలో ప్రత్యర్థులపై సాధించిన విజయాలతో రెండు జట్లు కూడా పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా 55 బంతుల్లో 99 పరుగులు సాధించి జట్టును దాదాపు విజయం అంచుల దాకా తీసుకెళ్లగా, ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ కెఎల్ రాహుల్ 57 బంతుల్లో 71 పరుగులు చేసి జట్లు విజయంలో కీలక పాత్ర పోషించగా విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్‌లు అతనికి అండగా నిలిచారు.

క్రిస్ గేల్ సాధించిన 40 పరుగుల్లో 36 పరుగుల ద్వారా వచ్చినవే అంటే అతను ఇప్పటికీ విధ్వసక బ్యాట్స్‌మన్‌గానే ఉన్నాడని స్పష్టమవుతుంది. మయాంక్ అగర్వాల్(43) కూడా మరోసారి సత్తా చాటాడు. అంతేకాదు పంజాబ్ జట్టు బౌలింగ్ కూడా బలంగా ఉంది. మహమ్మద్ షమీ, ఆండ్రూ టై, హార్డుస్ విల్‌జోన్‌లాంటి బౌలర్లను ఎదుర్కోవడం ఢిల్లీ జట్టుకు అంత తేలిక కాదు. మరో వైపు సొంతగడ్డపై ఆడుతుండడం పంజాబ్ జట్టుకు కలిసి వచ్చే మరో అంశం. అయితే నరాలు తెగిపోయే ఉత్కంఠ మధ్య సూపర్ ఓవర్‌లో అద్భుత విజయం సాధించిన ఢిల్లీ జట్టు ఆ ఊపును అదే విధంగా కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. పృథ్వీషాతో పాటుగా ఆ జట్టులో రిషబ్‌పంత్, శ్రేయాస్ అయ్యర్, కాలిన్ ఇన్‌గ్రామ్ లాంటి నాణ్యమైన బ్యాట్‌మెన్ ఉన్నారు. వీరంతా రేపటి మ్యాచ్‌లో రాణిస్తారని ఆ జట్టు ఆశగా ఉంది. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే జటుట్లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బోల్ట్, ఙశాంత్ శర్మ, అక్షర్ పటేల్, వీరందరికి మించి రబడతో ఆ జట్టు పటిష్ఠంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు సమఉజ్జీ జట్ల మధ్య జరిగే ఈ పోరు అభిమానులకు కనువిందు చేయడం ఖాయమనే చెప్పాలి.