తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి

SMTV Desk 2019-04-01 14:04:43  temparature

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం పగటి పూట హైదరాబాద్ సహా ఏపీ తెలంగాణలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రామగుండం, కొత్తగూడెం పట్టణాల్లో గరిష్టంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడి ఒక్కసారిగా పెరగడంతో పగటిపూట నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం అత్యధికంగా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిర్మల్ జిల్లా పెంబిలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నిర్మల్ జిల్లా, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. చాలా జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. సోమ, మంగళవారాల్లో కూడా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

మరోవైపు కోస్తాంధ్రలో కూడా సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. రెండు నుంచి 3 డిగ్రీల ఎక్కువగా టెంపరేచర్స్ రికార్డ్ కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రెండు రోజుల్లో వర్షాలు కూడా కురవొచ్చన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పగలంతా భానుడు భగభగలాడగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. సాయంత్రానికి భారీ స్థాయిలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో భాగ్యనగర వాసులు వేడి వాతావరణం నుంచి కాస్త ఉపశమనం పొందారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, కూకట్‌పల్లి, మూసాపేట, బోరబండ, ఎర్రగడ్డ, నాంపల్లి, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.