'ఎన్నికల తరువాత నేనే డిల్లీ వచ్చి మీ అందరి భరతం పడతా'

SMTV Desk 2019-04-01 14:01:16  kcr.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం వనపర్తి, మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలలో ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌లపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్రమోడీ ఎంతసేపు అబద్దాలు, గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఈ దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసి నేర్చుకోమని ప్రధాని నరేంద్రమోడీకి హితవు పలికారు. తాము అమలుచేస్తున్న సంక్షేమపధకాలను కేంద్రప్రభుత్వం కాపీ కొట్టడమే కాకుండా వాటికి కేంద్రమే నిధులు అందిస్తోందని రాష్ట్ర బిజెపి నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మోడీ ప్రభుత్వం ఏమీ చేయనందునే రామజన్మభూమి, సర్జికల్ స్ట్రైక్స్ వంటి అంశాలను ఎన్నికలకు ముందు తెరపైకి తీసుకువస్తోందని ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల తరువాత తెరాస భరతం పడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ బెదిరించడంపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నికల తరువాత నేనే డిల్లీ వచ్చి మీ అందరి భరతం పడతానని’ కేసీఆర్‌ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలలో 118 స్థానాలలో పోటీ చేసి ఒకే ఒక సీటు గెలుచుకొని, 103 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయిన బిజెపికి లోక్‌సభ ఎన్నికలలో 16 స్థానాలలో డిపాజిట్లు రాకుండా చేసి గుణపాఠం చెప్పాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

రాష్ట్రంలో రైతులు, వివిద వర్గాల ప్రజల సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందని, కానీ మోడీ ప్రభుత్వం గత 5 ఏళ్ళలో ఏ వర్గానికైనా ఏమైనా మేలు చేసిందా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఒకపక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తూనే, మరోపక్క రాష్ట్రంలో వ్యవస్థలను ప్రక్షాళనం చేస్తూ దేశంలోకెల్లా అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన పాలన అందిస్తోందని సిఎం కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రాంతీయపార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు కేంద్రప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసి దేశాన్ని అభివృద్ధిపధంలో పరుగులు పెట్టిస్తానని సిఎం కేసీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌, బిజెపిల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తేకానీ దేశం అభివృద్ధి చెందదని, పేదరిక నిర్మూలన సాధ్యం కాదని సిఎం కేసీఆర్‌ అన్నారు. కనుక దేశంలో ఒక సరికొత్త రాజకీయవ్యవస్థను ఏర్పాటు చేసుకొనేందుకు 16 మంది తెరాస అభ్యర్ధులను గెలిపించాలని సిఎం కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.