విజయవంతంగా నింగిలోకి పీఎస్ఎల్వీ సీ45

SMTV Desk 2019-04-01 11:46:01  pslvc 45

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-45 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 27 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ఉదయం 9.27 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వాహక నౌక డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఇంటిలిజెన్స్‌ శాటిలైట్ ‘ఇమిశాట్’ను నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో పాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది. రాడార్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. నాలుగు దశల్లో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా మొత్తం 28 ఉప గ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో నిలిపింది. లిథువేనియా, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, అమెరికాకు చెందిన 28 నానో ఉపగ్రహాలను ఇది నింగిలోకి మోసుకెళ్లింది. ఒకే ప్రయోగంలో మూడు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి.

డీఆర్‌డీవో రూపకల్పన చేసిన ఇమిశాట్‌ 436 కేజీల బరువుంటుంది. తక్కువ ఎత్తు కక్ష్యలో తిరిగే ఈ ఉపగ్రహం రక్షణశాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని ఇది అందించనుంది. ఇప్పటివరకూ ఇలాంటి సమాచార సేకరణలో విమానాలపై భారత్‌ ఆధారపడుతోంది. ఇక నుంచి అంతరిక్ష ఫ్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి రానుంది.