శశికళ బయోపిక్ పై కన్నేసిన వర్మ

SMTV Desk 2019-04-01 11:37:02  Sashikala, varma,rgv

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు చిత్ర పరిశ్రమలో సంచలనానికి కేంద్రబిందువయ్యాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాను అడ్డుకోవాలని చాలా కుట్రలు జరిగాయని, అయినా తన చిత్రం విడుదల ఆగదని మొదటినుంచి అంటున్న వర్మ ఎట్టకేలకు చిత్రాన్ని ఏపీలో మినహాయిస్తే అంతటా విడుదల చేశాడు. ఇన్ని రోజుల నుంచి ఈ చిత్రం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకునేలా చేసిన వర్మ మరో బయోపిక్‌కు సన్నద్ధమయ్యాడు. అది తెలుగులో కాదు తమిళంలో. తాను మరో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నానంటూ వర్మ సంచలన ప్రకటన చేశాడు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బయోపిక్ అని పేర్కొన్నాడు. ‘దయలేని పురుషులకు వ్యతిరేకంగా అల్లుకున్న ఓ బంధం కథ. జైళ్లు, మన్నార్‌గుడి గ్యాంగ్స్’ అంటూ వర్మ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. ఇప్పటికే తమిళంలో జయలలిత బయోపిక్ చిత్రం మొదలు కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషించనుంది. ఇదిలావుండగా దానికి పోటీగా వర్మ తెరకెక్కించాలనుకుంటున్న శశికళ బయోపిక్ తమిళ చిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో ఎన్ని ప్రకంపనలు సృష్టించనుందో అని వర్మ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు ముందు కూడా వర్మ ఓసారి ఈ చిత్రంపై ప్రకటన చేశాడు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ పూర్తి అయింది గనక ఈ చిత్రాన్ని తీసే పనిలో పడ్డట్టున్నాడు వర్మ.