కొత్త ఆర్థిక సంవత్సరం...సామాన్య ప్రజలపై అధిక భారం

SMTV Desk 2019-03-31 18:14:36  economic year, new year, 2019 economic year

మార్చ్ 31: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా చాలా మార్పులు అమలులోకి వచ్చి సామాన్య ప్రజలపై డైరెక్ట్‌గానే ప్రభావం పడనుంది. అలాగే పలు అంశాలకు సంబంధించి సామాన్య ప్రజలకు ఊరట లభించనుంది.

ధరలు తగ్గేవి :

✺ ఇంటి ధర దిగిరానుంది. జీఎస్‌టీ కౌన్సిల్ ఇటీవలే రియల్ ఎస్టేట్‌కు సంబంధించి కొత్త రేట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటి ప్రకారం నిర్మాణంలో ఉన్న ఇళ్లపై పన్ను రేటు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది. అందుబాటు గృహాలపై జీఎస్‌టీ 8 శాతం నుంచి 1 శాతానికి దిగొస్తుంది. దీంతో ఇంటి కొనుగోలు వ్యయం తగ్గనుంది. తగ్గిన పన్ను రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
✺ జీవిత బీమా పాలసీ ప్రీమియం కూడా తగ్గనుంది. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ కంపెనీలు 2006-08 మరణాల రేట్ల ప్రాతిపదికన పాలసీ ప్రీమియం నిర్ణయించేవి. ఏప్రిల్ 1 నుంచి 2012-2014 నాటి మరణాల రేటు ఆధారణంగా పాలసీ ప్రీమియం నిర్ణయిస్తాయి. దీంతో ప్రీమియం తగ్గుతుంది. 22 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి ప్రయోజనం కలుగనుంది.
✺ ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల రుణాలు చౌకగా మారనున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటు ఆధారంగా బ్యాంకులు రుణాలను ఆఫర్ చేయనున్నాయి. ఇప్పటిదాకా బ్యాంకులు రుణ రేట్లకు ఎంసీఎల్ఆర్‌ను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు తగ్గితే బ్యాంక్ రుణ రేట్లు కూడా తగ్గుతాయి.

ధరలు పెరిగేవి :
✺ కార్ల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. టాటా మోటార్స్, రెనో ఇండియా, జాగ్వార్ ల్యాండ్ రోవర్, మహీంద్రా, టయోటా మోటార్స్ కంపెనీలు ఇప్పటికే కార్ల ధరల పెంపును ప్రకటించాయి. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల కారణంగా కార్ల ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీలు పేర్కొంటున్నాయి.
✺ ఏప్రిల్ 1 నుంచి సహజ వాయువు ధర పెరగనుంది. దీంతో సీఎన్‌జీ ధర కూడా పెరుగుతుంది. కొన్ని వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌కు బదులు సీఎన్‌జీని ఇంధనంగా వాడతారు. దీంతో డ్రైవర్లపై భారం పడనుంది.
✺ వంట గ్యాస్ ధర కూడా పెరగనుంది. దేశీ నేచురల్ గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. దీంతో వంట గ్యాస్ ధర కూడా పైకి కదలనుంది.