రోహిత్ కు రూ. 12 లక్షల జరిమానా

SMTV Desk 2019-03-31 15:21:50  ipl 2019, mumbai indians, mumbai indians captain, rohit sharma

ముంబై, మార్చ్ 31: ముంబయి ఇండియన్స్ టీమ్‌ కెప్టెన్ రోహిత్ శర్మ‌కు గట్టి షాక్ ఎదురైంది. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మొహాలి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌.. తమకి కేటాయించిన సమయంలో నిర్దేశించిన ఓవర్లని పూర్తి చేయలేకపోయింది. అయితే.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రోహిత్ కు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. ‘ఐపీఎల్ 2019 సీజన్‌లో రోహిత్‌‌కి ఇది తొలి తప్పిదం.. ఐపీఎల్‌ నియమ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ తప్పిదానికి అతనికి రూ. 12 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు’ ఐపీఎల్ ఓ ప్రకటనని విడుదల చేసింది. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు.. డికాక్ (60: 39 బంతుల్లో 6x4, 2x6) అర్ధశతకం బాదడంతో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కేఎల్ రాహుల్ (71 నాటౌట్: 57 బంతుల్లో 6x4, 1x6) అజేయ అర్ధశతకం బాదడంతో 8 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు విజయాన్ని అందుకుంది. ఆ జట్టుకి ఓపెనర్ క్రిస్‌గేల్ (40: 24 బంతుల్లో 3x4, 4x6) మెరుపు ఆరంభమివ్వగా.. నెమ్మదిగా జోరు అందుకున్న రాహుల్.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ (43: 21 బంతుల్లో 4x4, 2x6)తో కలిసి ఆ జట్టుని విజయతీరాలకి చేర్చాడు. అయితే.. కీలక సమయంలో అగర్వాల్ ఔటైనా.. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (15 నాటౌట్: 10 బంతుల్లో 2x4)తో కలిసి మరో 8 బంతులు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనాన్ని 177/2తో రాహుల్ పూర్తి చేశాడు.